అకాల వర్షాలు.. వడగండ్ల వానల బారిన పడిన వరంగల్ జిల్లా రైతాంగం ఇంకా కోలుకోలేకపోతోంది. మూడు రోజులు గడిచినా, దుఃఖం నుంచి తేరుకోలేక పోతున్నారు. చేజారిన పంటను చూసి కుదేలవుతున్నారు. షడ్రుచుల పండుగ ఉగాది.. మామిడి రైతులకు ఖేదాన్ని మిగిల్చింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 4 వేల 530 ఎకరాల్లో మామిడి నేల రాలింది. నిన్నటి దాకా నిండా కాయలతో కనిపించిన మామిడి చెట్లు.. ఇప్పుడు కాయన్నదే లేకుండా మారాయని నేల రాలిన కాయలను ఏరుకుంటూ అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రాలిన కాయలు ఏరుతూ చేలల్లోనే గడుపుతున్న రైతులు: కాయలు దెబ్బతిని, ఎందుకూ పనికిరాకుండా పోయాయని వాపోతున్నారు. ఇక మిరప రైతుల ఆవేదన అంతా ఇంతా కాదు. ఏ చేను చూసినా నేలరాలిన మిర్చే కనపడుతోంది. రాలిన కాయలు ఏరుతూ చేలల్లోనే ఉదయం నుంచి సాయంత్రం వరకూ మిరప రైతులు గడుపుతున్నారు. కొందరు కూలీ ఖర్చులు కూడా దండగగా భావించి రాలిన పంటను అలాగే వదిలేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 3 వేల 713 ఎకరాల్లో పంట నష్టపోయినట్లు.. అధికారులు ప్రాథమిక అంచనా వేశారు.
దాదాపు 76 వేల ఎకరాల్లో పంట వర్షార్పణం:ఇటు మొక్కజొన్న రైతులూ.. జరిగిన నష్టం నుంచి కోలుకోలేకపోతున్నారు. నేలకొరిగిన మొక్కలను చూసి బావురు మంటున్నారు. దాదాపు 76 వేల ఎకరాల్లో పంట వర్షార్పణమైంది. ఉగాది పండుగను ఆనందంగా జరుపుకుందామనుకుంటే.. అకాల వర్షాలు పండుగ సంతోషం లేకుండా చేశాయని రైతులు వాపోతున్నారు. పెట్టుబడి ఖర్చులు కూడా రాకుండా అప్పుల పాలయ్యామని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అండగా ఉంటాం.. అధైర్య పడొద్దు..: ఇక జిల్లాలో పలు చోట్ల రేకులు చిల్లులుపడి నివాసయోగ్యం కాకుండా పోయాయి. కష్టకాలంలో రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని అధైర్య పడవద్దని మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు వారికి భరోసా ఇచ్చారు. అధికారులు పంట నష్టం వివరాలు పూర్తిగా సేకరిస్తున్నారని ముఖ్యమంత్రి కూడా జిల్లా బాధిత రైతులను పరామర్శిస్తారని తెలిపారు. గత ఏడాది అకాల వర్షాలు సంక్రాంతి పండుగ సంతోషం దూరం చేస్తే ఈ దఫా వానలు ఉగాది పర్వదినం ఆనందాన్ని దూరం చేసి.. కోలుకోలేని నష్టం తెచ్చాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అకాల వర్షాలతో తీవ్రనష్టం.. అన్నదాతలకు చేదును మాత్రమే మిగిల్చిన ఉగాది పర్వదినం ఇవీ చదవండి: