తెలంగాణ

telangana

ETV Bharat / state

Bharatmala Land Survey: 'నాగ్‌పుర్‌-విజయవాడ రహదారికి మా భూములు ఇచ్చేదేలే'

Bharatmala Land Survey: హనుమకొండ జిల్లా ఊరుగొండ గ్రామంలో బొల్లు రాజిరెడ్డి.. వారసత్వంగా వచ్చిన మూడెకరాల భూమినే నమ్ముకుని వరి, పసుపు, మొక్కజొన్న సాగు చేస్తున్నారు. సేకరణ కోసం ఈ భూమిలో అధికారులు సర్వే చేపట్టారు. భూమి పోతే తన కుటుంబం రోడ్డు మీద పడుతుందని ఆయన తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ఈ చిత్రంలో ఉన్న ఇతర రైతులదీ అదే బాధ. వీరే కాకుండా వేల మంది ఇప్పుడు పెద్ద పోరాటమే ప్రారంభించారు.

Bharatmala
Bharatmala

By

Published : Mar 21, 2022, 6:24 AM IST

Bharatmala Land Survey: భారత్‌మాల పరియోజన కింద నాగ్‌పుర్‌-విజయవాడ మధ్య నాలుగు వరుసల గ్రీన్‌ ఫీల్డ్‌ రహదారిని కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తోంది. ఇందులో భాగంగా జరుగుతున్న భూసర్వేను వెంటనే ఆపాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. తమ భూములు లాక్కోవద్దంటూ ఎక్కడికక్కడ సర్వేను అడ్డుకుంటున్నారు.

*రాష్ట్రంలో మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, హనుమకొండ, వరంగల్‌, మహబూబాబాద్‌, ఖమ్మం జిల్లాల్లో రహదారి నిర్మాణానికి దాదాపు 700 హెక్టార్ల భూమి అవసరం. మంచిర్యాల నుంచి హనుమకొండ వరకు ఇప్పటికే అధికారులు 54 గ్రామాల్లోని రైతుల భూముల్లో సర్వే చేపట్టారు. నష్టపరిహారంపై స్పష్టత ఇవ్వకుండానే అధికారులు పోలీసు బలగాలతో బలవంతంగా సర్వే చేస్తుండటంతో రైతులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. హనుమకొండ జిల్లా దామెర మండలంలోని ఊరుగొండలో ఎకరం భూమి విలువ రూ.2 కోట్లకుపైగా పలుకుతోంది. ఇక్కడ రిజిస్ట్రేషన్‌ విలువ ఎకరం రూ.50 లక్షల లోపే ఉంది. పైగా భూసేకరణ కోసం 2018లోనే నోటిఫికేషన్‌ ఇచ్చారు. దాని ప్రకారం పరిహారం చెల్లిస్తే మరో చోట కనీసం గుంట భూమి కూడా కొనలేమని రైతులు అంటున్నారు.

*హనుమకొండ జిల్లాలో భూసేకరణ వ్యవహారం ఇటీవల ఓ నవ వరుడి ప్రాణాలు తీసింది. దామెర మండలం పసరగొండకు చెందిన ఓ యువరైతుకు చెందిన భూమి ఎకరం పోతోందని తెలిసి పెళ్లయిన వారానికే ఆయన భార్య అలిగి పుట్టింటికి వెళ్లగా మనస్తాపంతో రైతు చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. వివాహ సమయంలో ఇచ్చిన పొలాలను భూసేకరణ కింద కోల్పోవాల్సి వస్తుండటంతో తమ కుమార్తె అల్లుళ్ల మధ్య గొడవలు తలెత్తుతున్నాయని బాధిత రైతులు వాపోతున్నారు.

కలెక్టర్‌ చొరవతో మెరుగైన పరిహారం

జాతీయ రహదారుల నిర్మాణం కోసం ‘జాతీయ రహదారుల చట్టం-1956 కింద భూసేకరణ చేపడతారు. పరిహారం 2013 చట్టం ప్రకారం చెల్లిస్తారు. నోటిఫికేషన్‌ వెలువడే నాటికన్నా మూడేళ్ల ముందు నుంచి ఆ ప్రాంతంలో క్రయవిక్రయాలు పరిశీలించి, అందులో అత్యధిక ధర చెల్లించిన మొత్తంలో సగం ధర లేదా మార్కెట్‌ విలువ ఏది ఎక్కువగా ఉంటే దాన్నే ప్రామాణికంగా తీసుకొని పరిహారం నిర్ణయిస్తున్నారు. అయితే గ్రీన్‌ఫీల్డ్‌ హైవే కోసం 2021 మార్చిలో నోటిఫికేషన్‌ వెలువడింది. దీని ప్రకారం చెల్లిస్తే రైతులు తీవ్రంగా నష్టపోతారు. అయితే పరిహారం విషయంలో రైతులకు కొంత న్యాయం చేసేందుకు కలెక్టర్‌కు అవకాశం ఉంది. రైతులు కలెక్టర్‌ను ఆశ్రయిస్తే ఆయన ఆర్బిట్రేషన్‌ విధానంలో అక్కడి భూముల అసలు ధరల ప్రకారం 50 శాతం వరకు పరిహారం పెంచే వీలుంది. దానిపై కూడా బాధితులు సంతృప్తి చెందకపోతే కోర్టును ఆశ్రయించవచ్చు.

త్వరలో పరిహారం నిర్ణయిస్తాం..

భూసేకరణ సర్వే హనుమకొండ వరకు పూర్తయ్యింది. పరిహారం త్వరలో నిర్ణయిస్తాం. రైతుల భూముల్లో నుంచే కాబట్టి, మంచి పరిహారం ఇప్పించేందుకు ప్రయత్నిస్తున్నాం.

-పోరిక మోహన్‌లాల్‌, భూసేకరణ ప్రత్యేక అధికారి

భూమినే నమ్ముకొని బతుకుతున్నాం..

నాకున్న 15 గుంటల భూమి రహదారిలో పోతోంది. ఆ భూమినే నమ్ముకుని బతుకున్నాం. ఇప్పుడది పోతే ఎలా బతకాలి? కనీసం పరిహారమైనా మార్కెట్ విలువ ప్రకారం ఇప్పించాలని కోరుతున్నాం.

- సంతోషం శంకరయ్య, కుందారం, జైపూర్‌ మండలం, మంచిర్యాల జిల్లా

మనస్తాపంతో రైతు మృతి

జాతీయ రహదారికి తమ భూమి పోతుందని మనస్తాపంతో రైతు మృతి చెందిన ఘటన హనుమకొండ జిల్లా దామెర మండలం పసరగొండలో జరిగింది. స్థానికుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన శనిగరం వెంకట్రాజం(75)కు గ్రామంలో 10 ఎకరాల భూమి ఉండగా, ముగ్గురు కుమారులతో కలిసి వ్యవసాయం చేసుకుంటున్నారు. నెలరోజుల కిందట నాగ్‌పుర్‌-విజయవాడ ఎక్స్‌ప్రెస్‌ జాతీయ రహదారికి నిర్వహించిన సర్వేలో మూడెకరాలకు పైగా పోతున్నట్లు తేలింది. వ్యవసాయమే జీవనాధారంగా బతుకుతున్న తమకు భూమి పోతోందని ఆవేదన చెందిన వెంకట్రాజం అస్వస్థతకు గురయ్యారు. అప్పటి నుంచి మంచానికే పరిమితమై, ఏమీ తినకపోవడంతో ఆరోగ్యం పూర్తిగా క్షీణించి ఆదివారం మధ్యాహ్నం మృతి చెందారు.

ABOUT THE AUTHOR

...view details