హుజూరాబాద్‌లోని ఎస్సీలకు రూ.10 లక్షల చొప్పున ఇవ్వటాన్ని స్వాగతిస్తున్నట్లు మాజీ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ మండలంలో ఈటల చేపట్టిన ప్రజా దీవెన పాదయాత్ర రెండో రోజు కొనసాగుతోంది. మండలంలోని గూడూరు, నేరెళ్ల, లక్ష్మీపూర్, కాశింపల్లి, పంగిడిపల్లి, వంగపల్లి గ్రామాల మీదుగా పాదయాత్ర సాగుతోంది. గ్రామాల్లో నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలుకుతున్నారు. డప్పు బృందాలు, కోలాట కళాకారుల నృత్యాలతో దారి పొడవునా.. ప్రదర్శనలతో జనం నీరాజనం పలికారు. గ్రామాల్లోని ప్రధాన వీధుల్లో పర్యటిస్తూ.. ప్రజలను ఈటల కలుసుకున్నారు. స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
రైతు కూలీలతో ముచ్చట...
గూడూరు గ్రామశివారులో వరి పొలాల్లో నాటు వేస్తున్న కూలీల దగ్గరికి వెళ్లిన ఈటల వారితో కాసేపు ముచ్చటించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఉప ఎన్నికల పుణ్యమా అని ఎస్సీ కుటుంబాల్లో మంచి ఆర్థిక పరిపక్వత కలగాలని ఆశిస్తున్నాట్లు ఈటల తెలిపారు. ఇది కేవలం హుజూరాబాద్‌లోనే కాకుండా రాష్ట్రంలో ఎక్కడ నిరుపేద ఎస్సీ కుటుంబాలున్నాయో వారందరికీ ఈ పథకం వర్తింపజేయాలని డిమాండ్ చేశారు.