తాను ఈ ఉపఎన్నికల్లో(huzurabad by election) ఓడిపోతే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఇప్పటికే చెప్పానని.. తెరాస ఓడిపోతే అసెంబ్లీకి రావద్దని.. ఆయన ముఖం చూపించొద్దని.. దీనికి అంగీకరిస్తారా అంటూ సీఎం కేసీఆర్‌కు ఈటల రాజేందర్ సవాల్ విసిరారు. హనుమకొండ జిల్లా శంభునిపల్లి, దేశరాజుపల్లిలో ఆయన ప్రసంగించారు తాను ఎమ్మెల్యేగా రాజీనామా చేయడం వల్లే గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజీలు వస్తున్నాయని ఈటల రాజేందర్ అన్నారు. కొప్పుల ఈశ్వర్ అనే మంత్రి, షార్ట్ నిక్కర్ వేసుకుని వచ్చిన ఎమ్మెల్యే మరొకరు.. నాపై నేనే దాడి చేయించుకుంటానని ప్రచారం(huzurabad by election compaign) చేశారని ఈటల ఆరోపించారు. తెరాస నేతలు మోకాళ్ల మీద నడిచినా.. ఓటుకు లక్ష ఇచ్చినా.. మంత్రులు వచ్చి బాటిళ్లు ఇచ్చినా.. హుజూరాబాద్‌లో ఈనెల 30న కర్రు కాల్చి వాతపెడతారని ఈటల ధీమా వ్యక్తం చేశారు.
రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు తనకు అండగా ఉన్నారని ఈటల వెల్లడించారు. చదువుకున్న బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వలేదని ఆయన మండిపడ్డారు. 2వేల పింఛన్‌కు మురిసిపోతున్న తల్లులే... తమ బిడ్డలు చదువుకుని రోడ్లమీద తిరుగుతుంటే ఎంతో బాధపడుతున్నారన్నారు. ఉద్యోగాలు ఇవ్వకపోగా.. ఇస్తానన్న నిరుద్యోగ భృతి ఇవ్వడం లేదని ఈటల రాజేందర్ విమర్శించారు. ఇక్కడ గెలిచిన సర్పంచులను, ఎంపీటీసీలను, జడ్పీటీసీలను కేసీఆర్ వచ్చి గెలిపించలేదన్న ఈటల.. వాళ్ల తరఫున ప్రచారం చేసి గెలిపించిన తనను వదిలి అందరూ వెళ్లిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ఓటేసి గెలిపించాలని ఆయన ఓటర్లను అభ్యర్థించారు.