కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ సాధన కోసం రైల్వే కోచ్ సాధన సమితి చలో హైదరాబాద్‌కు పిలుపునిచ్చింది. కొత్త కోచ్ ఫ్యాక్టరీ అవసరం లేదంటూ రైల్వే శాఖ ఇటీవలే స్పష్టం చేయడంపై భగ్గుమన్న కాజీపేట రైల్వే ఉద్యోగ, విశ్రాంత, ఇతర ప్రజాసంఘాల ప్రతినిధులు డివిజన్ పోరాట సమితిగా ఏర్పడి ఉమ్మడిగా పోరాడాలని నిర్ణయించారు. కాజీపేట, వరంగల్, హన్మకొండల్లో ప్లకార్డులతో నిరసన చేపట్టారు. తెరాస, కాంగ్రెస్ నాయకులు కూడా వీరి ఆందోళనకు మద్దతిచ్చి జిల్లాలో ధర్నాలు చేశారు. పార్లమెంటు సాక్షిగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయాలని కోచ్ ఫ్యాక్టరీతో పాటు కాజీపేట్ డివిజన్ కూడా ఏర్పాటు చేయాలని నాయకులు డిమాండ్ చేశారు.
నిరుద్యోగుల కల సాకారం కోసమే..
పోరులో భాగంగా ఇవాళ హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద ఆందోళన చేయనున్నారు. ఏప్రిల్ 5న దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద దీక్ష చేపడతామని కోచ్ ఫ్యాక్టరీ సాధన సమితి ప్రతినిధులు వెల్లడించారు. వేలాది మంది నిరుద్యోగుల కల సాకారం కోసమే ఈ ఉద్యమమని న్యాయ పోరాటానికి తాము సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. రాజకీయ పార్టీల నేతలు కూడా తమతో కలసి వచ్చి చిత్తశుద్దిని చాటుకోవాలన్నారు.