తాను పార్టీ మారలేదని.. తనకు తానుగా రాజీనామా చేయలేదని ముందు ఆరోగ్యశాఖ మంత్రిని తీసేశారని.. ఆ తర్వాత మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేస్తే ఆత్మగౌరవం కోసం రాజీనామా చేశానని మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ఆత్మగౌరవం కోసం ఎమ్మెల్యే పదవిని తృణప్రాయంగా వదిలేశానని ఆయన స్పష్టం చేశారు. కరీంనగర్, హనుమకొండ జిల్లాల్లో పర్యటించిన ఈటల రాజేందర్.. తాను రాజీనామా చేస్తే దళిత బంధు, పింఛన్లు, నిధులు వెల్లువలా వచ్చాయని.. తాను రాజీనామా చేస్తే డీడీలు కట్టి ఏళ్లు గడిచినా రాని గొర్రెలు వచ్చాయని.. ప్రగతి భవన్ నుంచి ముఖ్యమంత్రి బయటికి వచ్చి దళితులతో కలిసి భోజనం చేస్తున్నారని ఎద్దేవా చేశారు.
తాను మంత్రిగా ఎమ్మెల్యేగా చేయలేని పనులు రాజీనామాతో చేయగలిగానన్న సంతృప్తి మిగిలిందని అన్నారు. త ఏడేళ్ల కాలంలో అంబేడ్కర్ బొమ్మకు ముఖ్యమంత్రి దండ వేశారా.. జైభీం అన్నారా అని ప్రశ్నించారు. ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్ ఉన్న పనులన్నీ రాజీనామా చేస్తేనే ప్రారంభమయ్యాయని పేర్కొన్నారు. మొన్నటి వరకు అన్యాయం జరిగిందని ఏడ్చిన హరీశ్ రావు.. అన్ని మరిచిపోయి తనపై విమర్శలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు.