University education departmet: భవిష్యత్తు ఉపాధ్యాయులను తీర్చిదిద్దేందుకు రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో నెలకొల్పిన విద్యావిభాగాలు(ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్లు) నామమాత్రంగా మారిపోయాయి. రాష్ట్రంలో రెండో పెద్ద విశ్వవిద్యాలయమైన కాకతీయ వర్సిటీలోని ఆ విభాగంలో శాశ్వత బోధనా సిబ్బంది ఒక్కరు కూడా లేకపోవడం దుస్థితికి దర్పణం పడుతోంది. ఇక్కడ ఉన్న ఆరుగురు బోధనా సిబ్బంది పదవీ విరమణ చేయడంతో ప్రిన్సిపల్ సహా అంతా కాంట్రాక్టు అధ్యాపకులే. పాలమూరు వర్సిటీలో విభాగమున్నా.. అంతా కాంట్రాక్టు అధ్యాపకులే. ఫలితంగా బీఈడీ, ఎంఈడీ కోర్సుల్లో నాణ్యత ప్రమాణాలు పడిపోతున్నాయి. కనీసం డీన్లుగా వ్యవహరించేందుకు ఒక్క శాశ్వత బోధనా సిబ్బంది కూడా లేకపోవడంతో ఓయూలో అంతంతమాత్రంగా ఉన్న ఆచార్యులే అన్నింటినీ పంచుకోవాల్సి వస్తోంది. అన్ని వర్సిటీలకూ కలిపి కామన్ రిక్రూట్‌మెంట్ బోర్డు ద్వారా బోధనా సిబ్బందిని నియమిస్తామని ప్రభుత్వం ప్రకటించినా.. ఆ దిశగా పురోగతి కరవైంది.
ఇదీ దుస్థితి..కాకతీయ వర్సిటీలో 40 ఏళ్ల కిందట విద్యావిభాగాన్ని నెలకొల్పారు. ఎంఈడీ కోర్సును అందిస్తున్నారు. ఒకప్పుడు ఆరుగురు శాశ్వత ఆచార్యులు ఉండేవారు. ఒక్కొక్కరూ పదవీ విరమణ పొందుతుండటంతో విభాగమంతా ఖాళీ అయింది. దాంతో అక్కడే పదవీ విరమణ చేసిన రాంనాథ్ కిషన్‌ను డీన్‌గా వర్సిటీ నియమించింది. కళాశాల ప్రిన్సిపాల్ కూడా కాంట్రాక్టు అధ్యాపకుడే. ఇక్కడ బీఈడీ కోర్సును సెల్ఫ్ ఫైనాన్స్ విధానంలో ప్రవేశపెట్టారు.
*డిచ్‌పల్లిలోని తెలంగాణ విశ్వవిద్యాలయం కింద విద్యావిభాగం కోసం నిజామాబాద్‌లో ప్రత్యేక కళాశాల నడుస్తోంది. బీఈడీ, ఎంఈడీ కోర్సులను అందిస్తుండగా.. అధ్యాపకులంతా కాంట్రాక్టు అధ్యాపకులే. న్యాయవిద్య విభాగంలోనూ అదే పరిస్థితి. రెండు విభాగాలకు డీన్లుగా ఓయూ ఆచార్యులే వ్యవహరిస్తున్నారు.
*పాలమూరు విశ్వవిద్యాలయాల్లో ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్‌ను దశాబ్దం కిందట ఏర్పాటు చేసి ఎంఈడీ కోర్సును ప్రవేశపెట్టారు. అది సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సు కావడంతో ప్రభుత్వం శాశ్వత ఆచార్యుల పోస్టులను మంజూరు చేయలేదు. అక్కడంతా కాంట్రాక్టు అధ్యాపకులే. ప్రిన్సిపల్ సైతం ఒప్పంద అధ్యాపకుడే ఉన్నారు.