నిజాం కాలంలోనే వరంగల్ పట్టణ ప్రజల దాహం తీర్చేందుకు బాటలు పడ్డాయి. నగరం కంటే 30- 40 మీటర్ల ఎత్తులో ఉన్న ధర్మసాగర్ చెరువును ఆ కాలంలోనే తాగునీటి అవసరాలకు వినియోగించాలని నిర్ణయించారు. ఒక టీఎంసీ నీళ్లను వాడుకునేందుకు ప్రతిపాదించారు. దేవాదుల ప్రాజెక్టు ద్వారా 110 కిలోమీటర్ల నుంచి గోదావరి నదీ జలాలు పంపింగ్ పద్ధతిన ధర్మసాగర్ జలాశయానికి వస్తాయి. ఐదేళ్లుగా నగర ప్రజల దాహం తీరుస్తోంది. రోజూ 170 ఎంఎల్‌డీ నీరు గ్రావిటీ ద్వారా ఫిల్టర్ బెడ్లకు చేరుతోంది. ఆరేళ్ల క్రితం ఎండాకాలంలో హన్మకొండ వడ్డేపల్లి చెరువు, వరంగల్ భద్రకాళి చెరువు ద్వారా తాగునీరు అందించే వారు. ప్రస్తుతం ధర్మసాగరు రిజర్వాయరే నీటి అవసరాలు తీరుస్తోంది. నగర విస్తీర్ణం, పెరుగుతున్న జనాభాకనుగుణంగా తగిన ప్రణాళిక ఉంది. 110 కిలోమీటర్ల దూరంలో ఉన్న గోదారమ్మ గలగలా పారుకుంటూ నగర ప్రజల దాహం తీర్చుతోంది. నగరానికి సరఫరా అయ్యే జలం ఎంతో విలువైందో అర్థం చేసుకోవచ్ఛు.
జనాభాకు అనుగుణంగా..
- వరంగల్ నగర విస్తరణ, జనాభా పెరుగుదలను దృష్టిలో ఉంచుకొని కరీంనగర్ లోయరు మానేరు డ్యాం నుంచి ధర్మసాగర్ వరకు 1400, 2000 ఎంఎం డయా పైపులైన్లు వేశారు. కొంత భాగం పెండింగ్‌లో ఉంది. ఇదీ పూర్తయితే దేవాదుల, ఎల్‌ఎండీ ద్వారా రా వాటర్ వస్తుంది.
వచ్చే 30 ఏళ్లలో నగర జనాభా 20 లక్షలు దాటుతుందని అంచనా. 320.48 ఎంఎల్‌డీలు అవసరముంటాయి. 2033 వరకు 231.28 ఎల్‌ఎల్‌డీకి ఢోకా లేదు. అదనంగా మరో రెండు ఫిల్టర్‌బెడ్లు ప్రతిపాదించారు.
వృథా శాతం తగ్గాలి
నగరంలో తాగునీటి వృథా ఎక్కువగానే ఉంది. రెండేళ్ల క్రితం హైదరాబాద్‌కు చెందిన ఓ ప్రైవేటు సంస్థ సర్వే చేపట్టింది. లీకేజీలు, అక్రమ నల్లా కనెక్షన్ల ద్వారా సరఫరా మొత్తంలో 10 శాతం వరకు వృథా అవుతుందని లెక్క తేల్చారు. ప్రస్తుతం 186 ఎంఎల్‌డీల నీటిని వినియోగిస్తున్నట్లు చెబుతున్నారు. ఇందులో 18 ఎంఎల్‌డీల నీరు వృథా అవుతుందని అంచనా వేశారు.
అద్దె ట్యాంకర్ల తొలగింపు
నగరంలో సుమారు 65 పైపులైన్లు లేని కాలనీలు ఉంటాయి. 54 అద్దె ట్యాంకర్ల ద్వారా తాగునీటిని అందించే వారు. రోజూ 360 ట్రిప్పులు వేసే వారు. అద్దెల వ్యయం ఏటా రూ.2 కోట్ల పైనే ఉంటోంది. అమృత్, అర్బన్ మిషన్ భగీరథ పనులు పూర్తవ్వడంతో అద్దె ట్యాంకర్లు సగానికి తగ్గించారు. 27 కొనసాగిస్తున్నారు. ఎండాకాలం తర్వాత 15 తొలగించేందుకు ప్రతిపాదించారు.
నమ్మకం కలిగించాలి..
గత కొన్ని రోజులుగా రంగు మారిన నీరు వస్తోంది. నల్లాల ద్వారా స్వచ్ఛమైన తాగునీరు సరఫరా చేయాలి. కలుషిత నీరు రాకుండా చూడాలి. లీకేజీలు అరికట్టాలి. రోజూ నల్లా నీళ్లు వస్తాయనే నమ్మకం కలిగించాలి. నెల రోజులుగా ఫర్వాలేదు.
--టి.మంజుల, గిర్మాజిపేట