Stray Dog Attacks in Warangal :వరంగల్ జిల్లాలో రోజురోజుకు శునకాల దాడులు పెరుగుతున్నాయి. గత నెలల కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడిన ఓ చిన్నారి చికిత్స పొందుతూ మృత్యువాత పడ్డాడు. రోడ్లపైనా, ఇళ్ల వద్ద కుక్కలు స్వైర విహారం చేస్తున్నా బల్దియా అధికారులు పట్టించుకోవట్లేదని నగరవాసులు ఆరోపిస్తున్నారు. కుక్కల బెడదతో ఇంటి నుంచి బయట అడుగుపెట్టాలంటే భయంగా ఉందని వాపోతున్నారు.
Boy Dies in Dogs Attack in Warangal : హనుమకొండ, వరంగల్, కాజీపేటల్లో కుక్కల దాడులు పెచ్చుమీరుతున్నాయి. శునకాల దాడులకు గురైన బాధితులు ఎంజీఎంకు పరుగులుపెట్టిన ఘటనలు తరచూ నగరంలో జరుగుతున్నాయి. హనుమకొండ జిల్లా బట్టుపల్లి శివారు కొత్తపల్లి గ్రామానికి చెందిన మత్యాసు కుమారుడు.. 18 నెలల డేవిడ్ అనే చిన్నారిపై గత నెల 17న వీధి కుక్కలు దాడి చేశాయి. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన బాలుడుని తల్లిదండ్రులు హాటాహుటిన వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో చేర్పించారు. మలేరియా కూడా సోకడంతో బాలుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృత్యువాత పడ్డాడు. ఈ మేరకు బాబు తండ్రి మడికొండ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
Stray Dog Attacks in Hanumakonda :హనుమకొండలోని రెడ్డి కాలనీలో ఇటీవల పిచ్చి కుక్క స్వైర విహారం చేసి ఏకంగా 28 మందిని తీవ్రంగా గాయపరిచింది. నెక్కొండలోనూ.. వీరమ్మ అనే వృద్ధురాలిపై శునకాలు దాడి చేయడంతో ఆమె మృతి చెందింది. రెండు నెలల క్రితం కాజీపేటలోని రైల్వే కాలనీలో యూపీకి చెందిన 7 సంవత్సరాల బాలుడు చోటు ఇంటి బయట ఆడుకుంటున్న క్రమంతో కుక్కలు దాడి చేశాయి. శునకాల దాడిలో గాయపడిన ఈ బాలుడు ఎంజీఎం ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయాడు. చోటూ మృతి చెందిన విషయం తెలుసుకున్న ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, నగరపాలక సంస్థ మేయర్ సుధారాణి మృతుని బందువులను పరమర్శించి.. మహా నగరపాలక సంస్థ తరుపున రూ.లక్ష పరిహారం అందజేశారు.