Ramappa Temple Latest News : సహజత్వం మూర్తీభవించిన శిల్పాలు.. రామప్ప పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. రామప్ప అందాలు వీక్షించేందుకు వచ్చే పర్యాటకుల కోసం ఆ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేసే దిశగా ప్రభుత్వాలు అడుగులు వేశాయి. దీనిలో భాగంగా కేంద్రం 'ప్రసాద్ పథకం' ద్వారా దేవస్థానానికి చక్కటి అవకాశం లభించింది. గత నెల 28న రామప్పకు విచ్చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ పథకం ద్వారా రూ.62 కోట్లతో చేపట్టనున్న పనులకు శంకుస్థాపన చేశారు.
నాలుగు విభాగాలుగా చేపట్టనున్న పనుల్లో మొదటి ప్రతిపాదిత ప్రాంతంలో రూ.34 కోట్లతో 10 ఎకరాల విస్తీర్ణంలో రెండంతస్థుల భవనాన్ని నిర్మిస్తారు. దీనిలో పర్యాటక, సమాచార కేంద్రశాఖల సమావేశ మందిరం, ఆధ్యాత్మిక కేంద్రం, గ్రంథాలయం, చారిత్రక సాంస్కృతిక కేంద్రం, చిత్రకళా మందిరం, భోజనశాల ఇంకా కాకతీయ కళాతోరణం వంటివి ఏర్పాటు చేస్తారు. రెండో ప్రతిపాదనలో 27 ఎకరాల్లో ఆంఫీ థియేటర్, ప్రకృతి సుందరీకణ పనులు చేపడతారు.