Mirchi prices in Enumamula market : వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో మిర్చి ధరలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. నిన్నటి వరకు రూ.22 వేలకు పరిమితమైన మిర్చి ధర... ఒక్కసారిగా పెరిగింది. ఏకంగా క్వింటా రూ.32వేలు పలికి... ఆల్టైమ్ రికార్డు నెలకొల్పింది. మార్కెట్ చరిత్రలోనే ఇంతటి గరిష్ఠ ధర నమోదు కావడం ఇదే తొలిసారి అని వ్యాపార వర్గాలు తెలిపాయి. గతేడాది రూ.26వేలు ధర పలికిన టమాట రకం (దేశీయ రకం) ఈ ఏడాది ఏకంగా రూ.32 వేల ధర నమోదు చేసింది.
పెరిగిన ధర.. తగ్గిన దిగుబడి
Mirchi ccosts : జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఘన్‌పూర్ మండలం కర్కెపల్లికి చెందిన భిక్షపతి 10 బస్తాలు తీసుకురాగా... కాకతీయ ఆడ్తి వ్యాపారి ద్వారా లక్ష్మీసాయి ట్రేడర్స్ ఖరీదుదారు రూ.32 వేల చొప్పున కొనుగోలు చేశారు. గత నెల 24న మిర్చికి గరిష్ఠంగా 29 వేల ధర పలికింది. రాష్ట్రవ్యాప్తంగా మిరప సాగు తగ్గడంతోపాటు ఊహించని విధంగా నల్లి ఆశించి మిరప పంటను దెబ్బ తీయడం కారణంగా మిర్చి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని వ్యాపారులు తెలిపారు. మిర్చి ధరలు బహిరంగ మార్కెట్‌లో రికార్డులు నమోదు చేసినప్పటికీ ఎక్కువ దిగుబడి లేకపోవడంతో కొంతమేర రైతులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు.
Mirchi prices in telangana : వివిధ రకాల మిర్చి(క్వింటా) ధరల వివరాలు..
- దేశీ (టమాట ) రూ.32,000
- వండర్ హాట్ రూ.21,000
- యూఎస్ 341 రూ.21,100
- దీపిక రూ.19,500
- తేజ రూ.18,100
పెట్టుబడి డబుల్
చీడపీడల నుంచి మిరప పంటను కాపాడుకునేందుకు రైతులు అనేకసార్లు పురుగు మందులను పిచికారీ చేశారు. ఈ క్రమంలో పెట్టుబడి భారీగా పెరిగిందని అన్నదాతలు చెబుతున్నారు. గతంతో పోలిస్తే ఈ ఏడాది పెట్టుబడి రెండింతలు పెరిగిందని... తెలిపారు. ఎన్నిసార్లు పురుగు మందులను చల్లినా... ఫలితం లేకుండా పోయిందని వాపోయారు. నల్లి వ్యాప్తి నివారించేందుకు శాస్త్రవేత్తలు చెప్పిన రసాయన ఎరువులను వారంలో మూడు సార్లు పిచికారీ చేశామని వివరించారు. అయితే వచ్చిన ఆ కొద్దిపాటి పంటకు రికార్డు స్థాయిలో రేటు పలకడం ఆనందం కలిగించే విషయమని అంటున్నారు.