మేడారం మహాజాతరకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో... చేపట్టిన అభివృద్ధి పనులన్నీ ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. కానీ క్షేత్ర స్థాయిలో కొన్ని పనులు ఆరంభ దశలోనే ఉంటే... మరికొన్ని ఇంకా ప్రారంభం కాలేదు. కొన్ని శాఖలవే పురోగతిలో ఉన్నాయి. నిధుల కేటాయింపుల్లో ఆలస్యం జరిగింది. పాలనాపరమైన అనుమతులు, టెండర్లు, అగ్రిమెంట్లతో మరింత జాగు అయింది. ఈ నేపథ్యంలో ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోవాల్సి ఉండగా వృథా చేస్తున్నారు.
ఏ పనులు ఏ స్థాయిలో ఉన్నాయంటే...
* ఆర్‌డబ్ల్యూఎస్ ఆధ్వర్యంలో సుమారు 9 వేల తాత్కాలిక మరుగుదొడ్ల నిర్మాణం చేయాల్సి ఉండగా, ఇంకా స్థలాలనే గుర్తిస్తున్నారు. నాలుగు ట్యాంకులు నిర్మిస్తున్నారు. ఇవి పునాది దశలోనే ఉన్నాయి. తాగునీటి సరఫరాకు పైపులైన్ల నిర్మాణం, నల్లాల బిగింపులు, చిన్న ట్యాంకుల పునరుద్ధరణ, తదితర పనులు ఇంకా మొదలు పెట్టలేదు.
* నీటి పారుదల శాఖ ఆధ్వర్యంలో జంపన్నవాగులో ఇసుక లెవలింగ్ పనులు కొనసాగుతున్నాయి. నాలుగు డోజర్లు వినియోగిస్తున్నా, వాటిని పూర్తిస్థాయిలో వాడటం లేదు. భక్తులు పుణ్యస్నానాలు ఆచరించేందుకు స్నానఘట్టాల వద్ద ఏర్పాట్లు, మరమ్మతులు చేపడుతున్నారు. మహిళలు దుస్తులు మార్చుకొనేందుకు గాను ప్రత్యేక గదుల పనులు ఇంకా ప్రారంభమే కాలేదు. ఇప్పటికే బుధ, గురు, శని, ఆదివారాల్లో భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు. వారికి కనీస సౌకర్యాలు లేవు.
* రహదారులు, భవనాల శాఖ ఆధ్వర్యంలో కొన్నే మొదలయ్యాయి. గొల్లబుద్దారం-మేడారం, తాడ్వాయి,-మేడారం, పస్రా-మేడారం రహదారుల మరమ్మతుల ప్రారంభమయ్యాయి. జంగాలపల్లి-గణపురం క్రాస్‌రోడ్డువి షురూ కాలేదు. కల్వర్టుల ఎత్తు పెంచడం, రహదారులకు ఇరుపక్కల పిచ్చిమొక్కలు తొలగించడం, బీటీ రెన్యువల్, తదితర పనులు పలుచోట్ల చేపట్టాల్సి ఉంది.