Negligence of Officials in Warangal MGM: పోస్టుమార్టం అనంతరం.. కడసారి చూపు కోసం ఎదురుచూస్తున్న కుటుంబసభ్యులు, బంధువులకు ఆసుపత్రి మార్చురీ సిబ్బంది ఓ మృతదేహాన్ని అప్పగించారు. దానిని కుటుంబసభ్యులు తీవ్ర విషాదంతో ఇంటికి తీసుకెళ్లారు. మృతదేహన్ని ఇంట్లోకి తీసుకెళ్లాకా.. డెడ్‌బాడీపై కప్పిన వస్త్రాన్ని తొలగించి చూసిన బంధువులు, కుటుంబీకులు ఒక్కసారిగా కంగుతిన్నారు. ఇది తమది కాదని తెలుసుకుని తిరిగి ఆసుపత్రికి తీసుకెళ్లి మార్చురీ సిబ్బందికి అప్పగించారు. మృతదేహాలు తారుమారైనట్లు తెలుసుకున్న అధికారులు వచ్చి చివరికి వాటిని సంబంధిత కుటుంబసభ్యులకు అప్పగించాల్సి వచ్చింది. పోస్టుమార్టం అధికారులు, మార్చురీ సిబ్బంది, పోలీసుల నిర్లక్ష్యంతో మృతదేహాలు తారుమారైన ఈ ఘటన ఉమ్మడి వరంగల్ జిల్లాలో శనివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..
హనుమకొండ జిల్లా వంగర మండలానికి చెందిన ఆశాడపు పరమేశ్వర్ (53) ఈ నెల 22న రాత్రి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ఎల్కతుర్తి క్రాస్‌రోడ్డులో ప్రమాదానికి గురయ్యారు. తీవ్రంగా గాయపడిన పరమేశ్వర్‌ను చికిత్స నిమిత్తం దగ్గరలోని వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించగా, అతను చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ మండలం తానేధార్‌పల్లి గ్రామానికి చెందిన రాగుల రమేశ్ (40) ఈ నెల 24న ఆత్మహత్యాయత్నం చేశాడు. దీనిని గమనించిన కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో చేర్పించారు.