కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా... మాస్కులు, థర్మల్ స్కానర్లు, శానిటైజర్లకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. ఇళ్లు, దుకాణాలు, వ్యాపార సముదాయాల్లో వీటిని విరివిగా వినియోగిస్తున్నారు. దీన్నే అవకాశంగా తీసుకుని... సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు.
ప్రకటనలతో కుచ్చుటోపీ
తక్కువ ధరకే మాస్కులు, థర్మల్ స్కానర్లు అంటూ... ప్రకటనలతో వ్యాపారులకు కుచ్చుటోపీ పెడుతున్నారు. ఇటీవల ఫేస్‌బుక్‌లో ప్రకటన చూసి... హన్మకొండకు చెందిన ఓ వ్యాపారి ఆన్‌లైన్‌లో ఆర్డర్ ఇచ్చారు. వ్యాపారితో సంప్రదింపులు జరిపిన అతను నమ్మకం కుదరగానే... ఏకంగా 16 లక్షల రూపాయల సొమ్మును ప్రకటనదారుడి అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్ చేశాడు. అనంతరం ప్రకటనదారుడి ఫోన్ స్విచ్ఛాఫ్ వచ్చింది. మోసపోయానని గ్రహించిన పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
తక్కువ ధరకే
థర్మల్ స్కానర్లు తక్కువ ధరకే అందిస్తామన్న ప్రకటన చూసి వరంగల్‌కు చెందిన మరో వ్యాపారి 5లక్షల రూపాయలు పోగొట్టుకున్నాడు. వరంగల్‌లో నివసిస్తున్న ఒడిశా యువకులు... తక్కువ ధరకే కారు ప్రకటన చూసి... ఇంటికి వెళ్లేందుకు ఉపయోగపడుతుందని కొనుగోలు చేద్దామనుకున్నారు. తీరా కొంత సొమ్ము చెల్లించి... మోసపోయామని తెలుసుకుని సైబర్ పోలీసులను ఆశ్రయించారు. రాజస్థాన్, బీహార్ రాష్ట్రాలకు చెందిన ముఠాలే... మాస్క్‌లు, థర్మల్ స్కానర్ల పేరిట మోసాలకు పాల్పడుతున్నారని సైబర్ పోలీసులు చెబుతున్నారు.