CP Ranganath Explained Bandi Sanjay Allegations: ప్రతి కేసులో ప్రమాణం చేయమంటే తాను 10 వేల సార్లు ప్రమాణం చేయాల్సి ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన ఆరోపణలను ఉద్దేశించి వరంగల్ సీపీ రంగనాథ్ కౌంటర్ ఎటాక్ ఇచ్చారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన కమిషనరేట్‌లో మీడియా సమావేశం నిర్వహించి, వివరణ ఇచ్చారు.
బండి సంజయ్ పదో తరగతి పేపర్ లీకేజీ కేసు విషయమై.. తనపై అనేక ఆరోపణలు చేశారని సీపీ రంగనాథ్ పేర్కొన్నారు. ఇలాగే సత్యంబాబు కేసు విషయంలో కూడా ఆరోపణలు చేస్తున్నారని.. అసలు ఆ కేసు దర్యాప్తు అధికారిని తాను కాదని వివరణ ఇచ్చారు. అరెస్ట్ చేశారన్న ఉక్రోశంతోనే.. తనపై ఈ విధంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు.. లేనిపోని ఆరోపణలు చేస్తున్నట్లుగా భావిస్తున్నట్లు తెలిపారు. అనేక కేసుల్లో నేరస్థులను అరెస్ట్ చేసినప్పుడు సహజంగానే.. కొంత మంది వ్యక్తులు తమపై వ్యతిరేకంగా మాట్లాడతారని చెప్పారు.
CP Ranganath on Bandi Sanjay: తాను గానీ ఒక్క సెటిల్మెంట్ దందా చేసినట్లుగా బండి సంజయ్ నిరూపిస్తే.. ఉద్యోగ వదిలి వెళ్లిపోతానని సీపీ సవాల్ విసిరారు. వ్యక్తిగతంగా తమకు ఎవరిపైనా ద్వేషం లేదని.. తాను ఎప్పుడూ కూడా రాజకీయలాకు అతీతంగానే వ్యవహరిస్తానని తెలిపారు. బాధితులకు న్యాయం అందించేందుకే తాను ఎల్లవేళలా అందుబాటులో ఉంటానన్నారు. తాము ప్రమాణం చేసే ఉద్యోగంలోకి వస్తామని.. ఇలాంటి కేసుల్లో మళ్లీ ప్రమాణం చేయమంటే చేస్తామని సీపీ స్పష్టం చేశారు. పరీక్ష ప్రారంభమయ్యాక పేపర్ బయటికొస్తే లీకేజీ కాదంటూనే.. మాల్ ప్రాక్టీస్ కేసును రాజకీయం చేయెద్దని విన్నవించారు.
తాము తమకు వచ్చిన ఆధారాలతోనే పదో తరగతి పేపర్ లీకేజీ కేసైనా, ఇంకా వేరే కేసైనా దర్యాప్తు చేస్తామని పేర్కొన్నారు. బీజేపీ నేత బండి సంజయ్‌తో తనకు ఎలాంటి గట్టు పంచాయతీ లేదని వివరించారు. బండి సెల్‌ఫోన్ అసలు మా దగ్గర లేదని వివరణ ఇచ్చారు. తాను ఎలాంటి సెటిల్మెంట్లు, దందాలు చేయనని.. కావాల్సి వస్తే ఖమ్మం, నల్గొండలో ఉన్న బీజేపీ వాళ్లను అడిగి తెలుసుకోవచ్చన్నారు. కొన్ని అనివార్య పరిస్థితుల్లోనే ఈ మీడియా సమావేశం నిర్వహించాల్సి వచ్చిందని.. లేకపోతే ఇలాంటి ఆర్భాటాలు తమకు అవసరం లేదని వివరించారు.
"ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో పని చేశాను.. ఎక్కడా ఎలాంటి సెటిల్మెంట్లు, దందాలు చేయలేదు. దర్యాప్తు సంస్థల్ని బెదిరించే ప్రయత్నం మంచిది కాదు. పార్టీలకు అతీతంగా బాధితులకు న్యాయం చేస్తాము. బండి సంజయ్ ఫోన్ అయితే మా దగ్గర లేదు. ఈ విషయంపై కరీంనగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు." - రంగనాథ్, వరంగల్ సీపీ
దర్యాప్తు సంస్థల్ని బెదిరించే ప్రయత్నం మంచిది కాదు: సీపీ