వరంగల్ మహా నగరంలో కొందరు కార్పొరేటర్ల భర్తల ఆగడాలు శ్రుతి మించిపోతున్నాయి. ‘ఆమె’ అధికారాన్ని అడ్డు పెట్టుకొని అనేక దందాలు సాగిస్తున్నారు. కార్పొరేటర్‌కు ఇచ్చే అధికారిక సిమ్ కార్డును కూడా వారే వినియోగిస్తున్నారు. ఏ విషయమైనా తమతోనే మాట్లాడాలని వారు ప్రజలకు చెబుతుండడం విడ్డూరం. భవన నిర్మాణాల్లో అక్రమ వసూళ్లు మొదలు.. భూ కబ్జాలు, ఇసుక, మొరం దందా, ఉద్యోగులపై పెత్తనం వరకు అన్నింటిలో వారిదే రాజ్యం. వీరి ఆగడాలతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. కార్పొరేషన్లో మొత్తం 36 మంది మహిళా కార్పొరేటర్లుండగా.. వారిలో పలువురి భర్తలు అడ్డగోలు దందాలు చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఖాళీ స్థలాలపై కన్ను..:వరంగల్ పాతబస్తీ ప్రాంతంలోని ఓ మహిళా కార్పొరేటర్ భర్త దృష్టి అంతా డివిజన్‌లో వివాదాస్పదమైన ప్రైవేటు ప్లాట్లపై ఉంటుంది. ఇప్పటికే నాలుగైదు కాలనీల్లో స్థలాలు తక్కువ ధరకు సొంతం చేసుకున్నారు. చెత్త తరలించే ట్రాక్టర్ డ్రైవర్‌ను డీజిల్ కోసం ఇబ్బందులకు గురి చేస్తున్నారు.
పారిశుద్ధ్య కార్మికులపై పెత్తనం చెలాయిస్తున్నారు..:
*గ్రేటర్ వరంగల్ పాలకవర్గంలో ఒక మహిళా ప్రజాప్రతినిధి భర్తకే ప్రోటోకాల్ ఎక్కువ. ఆయన దర్జాగా అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అధికారులు, ఉద్యోగులను పిలిపించి ఆదేశాలు జారీ చేస్తున్నారు. అన్ని విషయాలు తనకే చెప్పాలని హుకుం జారీ చేస్తుంటారు. విభాగాల నుంచి నెలవారీ మామూళ్లు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
*హసన్‌పర్తిలోని ఒక కార్పొరేటర్ భర్త.. ఎవరు ఇల్లు కట్టినా రూ.15 వేలకు తక్కువ తీసుకునేది లేదంటూ డిమాండు చేస్తున్నారు. కార్పొరేషన్ చైన్‌మెన్ నిర్మాణదారుల దగ్గరకు వెళ్లి కార్పొరేటర్‌తో సెటిల్ చేసుకోవాలని చెబుతున్నట్లు ఫిర్యాదులొస్తున్నాయి. అన్ని నిబంధనలతో ఇల్లు కడుతున్నా.. తామెందుకు డబ్బులు ఇవ్వాలని బాధితులు వాపోతున్నారు.
*ఓ కార్పొరేటర్ భర్త.. బీమారం పరిధిలోని ఒక చెరువులో 30 గుంటల వరకు ఆక్రమించారు. ఈయన గతంలో ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి స్థిరాస్తి దందా చేసినట్టు ఆరోపణలు వచ్చాయి.
*ఒక మహిళా కార్పొరేటర్.. తన భర్త దందాను చూసి తన డివిజన్‌లోనే తిరగడం మానుకున్నారు. ఒక యువతిని మోసం చేయడంతో అతనిపై కేసు కూడా నమోదైంది.