వరంగల్ అర్బన్ జిల్లాలో కరోనా విజృంభిస్తూనే ఉంది. ప్రారంభంలో 40 లేదా 50 కేసులు మాత్రమే రాగా... ఇప్పుడు బాధితుల సంఖ్య పెరిగిపోతుంది. ఆదివారం ఒక్కరోజే 117 కేసులు రావడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. సోమవారం సైతం 73 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో జిల్లా వాసులు భయాందోళనలకు గురవుతున్నారు.
అదనంగా పడకలు
ఎంజీఎంలో కొవిడ్ వార్డులో ఉన్న 200 పడకలు... బాధితులతో నిండిపోయాయి. మరో 200 పడకలను అందుబాటులోకి తెచ్చేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. స్థానికులే కాకుండా పోలీసులు, వైద్యులు, నర్సులు, పలువురు ప్రజాప్రతినిధులు కొవిడ్ బారిన పడుతున్నారు. వీరితో సన్నిహితంగా ఉన్నవారు హోం క్వారంటైన్లో ఉంటున్నారు.
స్వచ్ఛందంగా..
ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షలు జరుగుతుండటంతో... కేసుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. కేసులు ఎక్కువ అవుతుండడంతో... జనం బయటకు రావడానికే జంకుతున్నారు. రహదారులపైనా దుకాణాల వద్ద రద్దీ బాగా తగ్గింది. తదితర ప్రాంతాల్లో స్వర్ణకారులు, బట్టలు, వర్తక వాణిజ్య వ్యాపారులు స్వచ్ఛందంగా లాక్డౌన్ పాటిస్తున్నారు. కొందరు దుకాణాల సమయాలను తగ్గించారు.