వెయ్యి పడకల ఎంజీఎం ఆసుపత్రిలో ప్రస్తుతం సాధారణ వైద్యం కోసం వచ్చి చికిత్స పొందుతున్న వారు మొత్తం 220 నుంచి 250మంది ఉండగా, కొవిడ్, దాని అనుబంధ సారి వార్డులో ఉన్న 250 పడకలు రోగులతో నిండిఉన్నాయి.
సాధారణ రోగులకు ఆహారం అందించడానికి ఒప్పందం చేసుకున్న కాంట్రాక్టర్ ద్వారానే ప్రస్తుతం కొవిడ్ రోగులకు రోజుకు రూ.56 విలువైన పోషహాకారం అందిస్తున్నారు. ఉదయం, సాయంత్రం సాధారణ భోజనం పెడుతున్నారు.
భోజనంలో 150గ్రాముల కూరలు, 200 ఎంఎల్ మజ్జిగ, ఒక ఉడికించిన కోడిగుడ్డు, ఒక అరటిపండు, ఉదయం అల్పాహారంగా ఉప్మా, చపాతి, కిచిడి(ఇందులో ఏదో ఒకటి), చట్నీతోపాటు రాత్రి వేళ 200 మి.లీ పాలు ఇస్తున్నారు. సాధారణ రోగులకు, కొవిడ్ రోగులకు మధ్య వ్యత్యాసం ఉన్నా.. పోషకాహారం అందించడంలో ఆసుపత్రి అధికారులు విఫలమయ్యారు.
ధరల చెల్లింపులో తేడా
కరోనా రోగులకు పౌష్టికాహారం అందించడం కోసం ప్రభుత్వం గత నెల 15న జీవో 298ను జారీ చేసింది. దీని ప్రకారం అల్పాహారంలో ఇడ్లీ, బోండా, ఉప్మా, పూరి, ఊతప్పంలో ఏదో ఒకటి అందించాలి. పాలు ఇవ్వాలి. ఉదయం 11 గంటలకు బిస్కెట్‌తోపాటు టీ, కాఫీ ఏదో ఒకటి ఇవ్వాలి.
మధ్యాహ్నం భోజనంలో పప్పు, కోడిగుడ్డు, కూర, సాంబారు, పెరుగు అందించాలి. సాయంత్రం 4 గంటలకు డ్రైఫ్రూట్స్ కింద బాదంపప్పు, అంజీర ఇవ్వాలి. రాత్రి 8 గంటలకు భోజనంలో కోడిగుడ్డు, అరటిపండు, రెండు లీటర్ల మినరల్ వాటర్ అందించాలి. ఎప్పుడు ఇచ్చినా పోషహాకారం వేడివేడిగా, డిస్పోజబుల్ పాత్రలో మాత్రమే అందించాలని జీవోలో పేర్కొన్నారు.
అధికారులు లేక..జీవో అమలు కాక
కొవిడ్ రోగులకు బలవర్ధకమైన పోషహాకారం అమలు కాకపోవడంపై ప్రధాన కారణం పర్యవేక్షకులు లేకపోవడమే. ఆసుపత్రి సూపరింటెండెంట్‌గా ఉన్న డాక్టర్ శ్రీనివాసరావు రాజీనామా చేసి వెళ్లిపోగా, ఆయన స్థానంలో ఇన్‌ఛార్జిగా ఉన్న డిప్యూటీ సూపరింటెండెంట్, ఇద్దరు ఆర్‌ఎంవోలు అనారోగ్య కారణాలతో సెలవుపై వెళ్లారు. వారం రోజులుగా ఎంజీఎం ఆసుపత్రికి ఎవరూ దిక్కు లేకుండా పోయింది.
ప్రస్తుతం ఇన్‌ఛార్జి సూపరింటెండెంట్‌గా నాగార్జునరెడ్డిని మంగళవారం నియమించారు. ఆయనైనా కొవిడ్ రోగులకు పోషహాకారం అందేలా చూడాలని రోగుల కుటుంబసభ్యులు అభిప్రాయపడుతున్నారు. ఎక్కడైనా ఒకే విధమైన పోషకాహారం అందిస్తున్నప్పుడు ధరల చెల్లింపుల్లో వ్యత్యాసం ఉందంటూ ఎంజీఎం ఆసుపత్రిలో కాంట్రాక్టర్ కూడా ముందుకు రావడం లేదు.
ఇదీ చూడండి :ఈటీవీ భారత్ స్పందన: '‘పీఎం కిసాన్’'లో తెలంగాణకు చోటు