తెలంగాణ

telangana

By

Published : Jul 29, 2020, 6:03 PM IST

ETV Bharat / state

అయోమయంలో ఎంజీఎం.. కొత్త సూపరింటెండెంట్​పై ఉత్కంఠ

ఎంజీఎం సూపరింటెండెంట్ రాజీనామా చేయడంతో కొత్తగా వచ్చేవారెవరన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. సామర్థ్యం, అనుభవం ఉన్నవారిని నియమించేందుకు సర్కారు కసరత్తు చేస్తోంది. వరంగల్​లో కరోనా విజృంభిస్తూ.. కేసులు ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతున్న వేళ ప్రధాన ఆసుపత్రికి సూపరింటెండెంట్ లేకపోతే కలిగే మరిన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.

అయోమయంలో ఎంజీఎం.. కొత్త సూపరింటెండెంట్​పై ఉత్కంఠ
అయోమయంలో ఎంజీఎం.. కొత్త సూపరింటెండెంట్​పై ఉత్కంఠ

వరంగల్ ఎంజీఎం సూపరింటెండెంట్ శ్రీనివాసరావు... తన పదవికి రాజీనామా చేయగా ఏర్పడిన ఖాళీని భర్తీ చేసేందుకు ముమ్మర కసరత్తు జరుగుతోంది. ఇప్పటికే ఇద్దరు, ముగ్గురు వైద్యులు రేసులో ఉన్నారు. ఉత్తర తెలంగాణకే వైద్య ప్రదాయనిగా ఎంజీఎం ఆసుపత్రిని భావిస్తారు. ఎన్ని సమస్యలున్నా.. వసతలు లేమి ఉన్నా... అనుభవజ్ఞులైన వైద్యులకు పెట్టింది పేరు వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి.

ఘన చరిత్ర..

లక్షల రూపాయలు దండుకుని ఆఖరి నిమిషంలో ప్రైవేటు ఆసుపత్రులు చేతులెత్తేసి, విషమ పరిస్ధితిలో ఉన్న రోగులను ఎంజీఎంకి పంపిస్తే వారికి రేయింబగళ్లు శ్రమించి వైద్యులు ప్రాణదానం చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. వేయి పడకల ఆసుపత్రి అయినా... సామర్థ్యానికి మించి రోగులు ఇక్కడ చికిత్స పొందుతున్నారు.

మరో 250 పడకలు..

కంటిమీద కునుకు లేకుండా చేస్తోన్న కరోనా.. వరంగల్ లోనూ ఇటీవలి కాలంలో విస్తృతంగా వ్యాపిస్తోంది. ప్రదానంగా వరంగల్ అర్బన్ జిల్లాలో నిత్యం వందకుపైగానే కేసులు నమోదవుతున్నాయి. 250 పడకలతో కొవిడ్ వార్డు ఏర్పాటు చేసినా... కేసులు పెరుగుతుండడం వల్ల అవి చాలట్లేదు. జిల్లాలో కొవిడ్ నియంత్రణ... ఎంజీఎంలో చికిత్సలపై మంత్రులు ఈటల రాజేందర్, ఎర్రబెల్లి దయాకరరావు... మంగళవారం సమీక్షించి మరో 250 పడకలను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు వెల్లడించారు.

ఒత్తిడే కారణమా?

ఇదే సమయంలో కుటుంబసభ్యులకు కరోనా సోకగా.. 10 రోజుల సెలవులో ఉన్న ఎంజీఎం సూపరింటెండెంట్ బి. శ్రీనివాసరావు తన పదవికి రాజీనామా చేస్తూ... లేఖను డీఎంఈకి పంపించడం చర్చనీయాంశమైంది. ఇంఛార్జి సూపరింటెండెంట్ హోదాలో ఆర్థోపెడిక్ విభాగాధిపతి వెంకటేశ్వర్లు ఈ సమావేశానికి హాజరై... ఎంజీఎంలో కరోనా రోగులకు అందుతున్న చికిత్సలను మంత్రులకు వివరించారు. అనారోగ్యమే రాజీనామాకు కారణమని చెబుతున్నా... ఇతరత్రా ఒత్తిడులే సూపరింటెండెంట్ రాజీనామాకు దారితీసినట్లు తెలుస్తోంది.

సామర్థ్యం ఉన్నవారికే..

ఆసుపత్రిలో ఏం జరుగుతుందో తెలియని పరిస్ధితి నెలకొంది. జూనియర్ డాక్టర్లు తప్ప సీనియర్ డాక్టర్లు కొవిడ్ రోగులను పట్టించుకోవటంలేదన్న విమర్శలూ ఉన్నాయి. పీజీ వైద్యులు, సిబ్బంది ఆందోళనలు ఎక్కువైయ్యాయి. భోజనం సరిగ్గా అందట్లేదంటూ రోగులు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు ఆసుపత్రి పర్యవేక్షణాధికారి బాధ్యతలను ఎవరికి అప్పగిస్తారన్న ఉత్కంఠ నెలకొంది. సీనియర్ వైద్యులు, జనరల్ మెడిసిన్ విభాగానికి చెందిన చంద్రశేఖర్, గోపాలరావుతో పాటుగా ఇంకా ఒకరిద్దరి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. సామర్థ్యం అనుభవం ఉన్నవారిని నియమిస్తామని మంత్రి ఈటల ఇప్పటికే వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details