మేడారం జాతర హుండీల లెక్కింపు తుది దశకు చేరుకుంది. గద్దెల వద్ద ఏర్పాటు చేసిన 494 హుండీలను తెరిచి లెక్కిస్తున్నారు. కరెన్సీ నోట్ల లెక్కింపు ప్రక్రియ ఇప్పటికే పూర్తైంది. జాతర ఆఖరిరోజు భారీవర్షం కారణంగా కొన్ని హుండీలు తడిశాయి. అందులో నోట్లు తడిసి ముద్ద కావడం వల్ల నోట్ల లెక్కింపు ఆలస్యమైంది.
ఇప్పటికే 11 కోట్లు
ఇప్పటివరకూ 11 కోట్ల 17 లక్షల 99 వేల 985 రూపాయలు హుండీల ద్వారా ఆదాయం సమకూరింది. నోట్ల లెక్కింపు పూర్తైందని.. ఇప్పుడు భక్తులు వేసిన చిల్లర నాణాలను లెక్కింపు చేస్తున్నామని అధికారులు తెలిపారు. రూపాయి, రెండు, ఐదు, పది, రూపాయల నాణాలతోపాటు విదేశీ కరెన్సీ నాణాలు కుప్పలుగా పోసి లెక్కిస్తున్నారు. ఒడిబియ్యం జల్లెడ పట్టి చిక్కుకున్న చిల్లరను జాగ్రత్తగా వేరు చేస్తున్నారు.