రాజధాని హైదరాబాద్ తర్వాత అంతటి ప్రాముఖ్యమున్న నగరం వరంగల్ . ఎడతెరిపి లేని వానలకు తడసిముద్దయింది. జిల్లా కేంద్రమైన హన్మకొండలో రహదారులు గుంతలమయంగా మారి తటాకాలను తలపిస్తున్నాయి. నగరాభివృద్ధి కోసం విస్తృత ప్రణాళికలు రూపొందించినా... ఆచరణలో మాత్రం అధికారులు తరచూ విఫలమవుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఆకర్షణీయ నగర హోదా పొందినా.... పారిశుద్ధ్య నిర్వహణ లోపంతో... ఎక్కడ చూసినా చెత్తచెదారం పేరుకుపోయి అపరిశుభ్రత తాండవిస్తుండడం పట్ల విస్మయం వ్యక్తమవుతోంది.
ఉదాసీనతే కొంప ముంచింది
తాజాగా నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నగరం పూర్తిగా జలమయమైంది. ప్రధాన రహదారుల్లో ఎక్కడ చూసినా వరదనీరే. నాలాలన్నీ నదులను తలపిస్తూ ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. నాలుగేళ్ల క్రితము ఇదే రీతిలో నగరం జలమయమైంది. అస్తవ్యస్తంగా ఉన్న నాలాలకు మరమ్మతులు చేయకుండా అధికారులు చోద్యం చూస్తున్నారని స్థానికులు విమర్శిస్తున్నారు. నాలాల చుట్టూ ఆక్రమణలు జరుగుతున్నా... వాటి తొలగింపులో ఉదాసీనంగా వ్యవహరించడం వల్లే చిన్నపాటి వర్షానికి సైతం నగరం బురదమయంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.