వరంగల్ ఎంజీఎం కేంద్రంగా నకిలీ సర్టిఫికెట్ల దందా కొనసాగుతోంది. అనారోగ్య కారణాలను సాకుగా చూపి వారసులకు ఉద్యోగాలిప్పించే... వాలిడెట్ సర్టిఫికెట్ల జారీలో అవకతవకలు చోటుచేసుకుంటున్నాయి. ఆరోగ్యం బాగాలేని పక్షంలో.. తమ ఉద్యోగాలు వారసులకు ఇప్పించాలని కోరుతూ ఉద్యోగులు మెడికల్ ఇన్ వాలిడేట్ సర్టిఫికెట్లను సమర్పించాల్సి ఉంటుంది. రెండేళ్ల క్రితం బల్దియాతో పాటు వివిధ శాఖల్లో పనిచేస్తున్న సుమారు 80 మంది ఉద్యోగులు ఎంజీఎంకు మెడికిల్ ఇన్ వాలిడేట్ ధృవపత్రాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే వైద్యుల పరీక్షల్లో 27 మంది ఆరోగ్య రీత్యా అనర్హులుగా తేలగా.. మరో 53 మంది ఆరోగ్యంగానే ఉన్నారని వైద్యులు నిర్ధారించారు.
దొరికిపోయారు..
వైద్య నిపుణుల పరిశీలన కోసం...సదరు కేసులను ఉస్మానియా, గాంధీ, ఎర్రగడ్డ ఆస్పత్రులకు రిఫర్ చేశారు. ఎర్రగడ్డ ఆస్పత్రికి 27 మందిని పంపించగా... వారంతా వివిధ జబ్బులతో బాధపడుతున్నారంటూ అక్కడి వైద్యాధికారులు సర్టిఫై చేసిన ధృవపత్రాలను వరంగల్ ఎంజీఎం సూపరింటెండెంట్, మెడికల్ బోర్డు ఛైర్మన్‌కు సమర్పించారు. ఆ తర్వాత ఎర్రగడ్డ ఆసుపత్రి నుంచే... మరికొంతమంది కూడా ఇలాగే ధృవపత్రాలు తీసుకు వచ్చారు. అనుమానం వచ్చిన ఎంజీఎం సూపరింటెండెంట్ ఈ అంశంపై ఎర్రగడ్డ వైద్యాధికారులకు లేఖ రాశారు. సూపరింటెండెంట్ లేఖకు స్పందించిన ఎర్రగడ్డ వైద్యాధికారులు తామెవరికీ.. ఎలాంటి ధృవపత్రాలు ఇవ్వలేదని స్పష్టం చేశారు.