CM KCR on World Heritage Day 2023: ఎంతో విశిష్టమైన చారిత్ర వారసత్వ సంపద తెలంగాణ గడ్డకే సొంతమని ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్ఘాటించారు. వరల్డ్ హెరిటేజ్ డే సందర్భంగా తెలంగాణ రాష్ట్రానికున్న చారిత్రక ప్రస్తానాన్ని సీఎం స్మరించుకున్నారు. శాతవాహన వంశం నుంచి మొదలు అసఫ్ జాహీల వరకు సాగిన పాలన తెలంగాణను సుసంపన్నం చేశాయని వ్యాఖ్యానించారు. ఇక్కడి వైవిధ్యభరితమైన నిర్మాణ శైలులు, శిల్పకళలు, సంస్కృతి సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, భాష, యాస, సాహిత్యం వారసత్వ సంపదకు ఆలవాలం అన్నారు.
తెలంగాణ వారసత్వ సంపద: 45 వేల ఏళ్ల క్రితమే తెలంగాణ నేలమీద మానవ సంచారం సాగిందనడానికి.. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని పాండవుల గుట్టలో లభ్యమైన ప్రాచీనమానవుని పెయింటింగ్స్ నిదర్శనం అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. జైన బౌద్ధ ఆరామాలు, రామప్ప దేవాలయం, వేయిస్తంభాల గుడి, ఓరుగల్లు కోట, భువనగిరి కోట, గోల్కొండ కోట, పద్మాక్షిగుట్ట, మెదక్ చర్చి, మక్కా మసీదు, చార్మినార్ వంటి ఎన్నో గొప్ప గొప్ప కట్టడాలు.. తెలంగాణ చారిత్రక, వారసత్వ వైభవాన్ని, ప్రత్యేకతను చాటుతున్నాయని తెలిపారు. కాకతీయుల కాలంలో నిర్మించిన ములుగు జిల్లా పాలంపేటలోని, ప్రసిద్ధ రామప్ప దేవాలయాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో చేర్చడం తెలంగాణ ప్రజలకు, దేశానికి గర్వకారణమని సీఎం కేసీఆర్ కొనియాడారు.