Tension at hanumakonda: హనుమకొండలోని భాజపా జిల్లా కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. 'అగ్నిపథ్'కు వ్యతిరేకంగా భాజపా కార్యాలయం వద్ద కాంగ్రెస్ ధర్నా చేపట్టింది. దీనిపై స్పందించిన భాజపా శ్రేణులు.. కాంగ్రెస్ కార్యకర్తలను అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం, ఘర్షణ జరిగింది. ఆగ్రహించిన భాజపా శ్రేణులు.. కాంగ్రెస్ నాయకుల వాహనాలపై దాడి చేశారు. ఇరువర్గాల పరస్పర దాడులతో హనుమకొండ భాజపా కార్యాలయం వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
విషయం తెలుసుకుని రంగంలోకి దిగిన పోలీసులు లాఠీఛార్జి చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు. ఈ క్రమంలో సీఐ దయాకర్, సుబేదారి సీఐ గన్‌మెన్ అనిల్‌కు గాయాలయ్యాయి. దాడిలో పలు కార్ల అద్దాలు ధ్వంసమయ్యాయి. మరోవైపు భాజపా కార్యాలయం వద్దకు వచ్చి కాంగ్రెస్ శ్రేణులు నిరసనకు దిగడాన్ని ఆ పార్టీ నాయకులు తీవ్రంగా ఖండించారు. ఈ దాడి వెనక తెరాస, కాంగ్రెస్‌ల హస్తముందని భాజపా జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ ఆరోపించారు. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆమె తెలిపారు.
మరోవైపు తెలంగాణ సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా నగరానికి వచ్చిన భాజపా ఎంపీ ఓం ప్రకాశ్ మాధుర్ లక్షర్ సింగారం దళితవాడలో పర్యటించాల్సి ఉండగా.. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే భాజపా కార్యకర్తలు పోలీసులను అడ్డుకోవడంతో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శాంతియుతంగా పర్యటన చేస్తున్న తనను అడ్డుకోవడం పట్ల ఓం ప్రకాశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెరాస, కాంగ్రెస్ రెండూ ఒక్కటై దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు.