నిన్నటిదాకా చిన్న చిన్న మొక్కలే. ఏడాది దాటకుండానే ఆ ప్రదేశం చిట్టడవిని తలపిస్తోంది. ప్రతిష్ఠాత్మక జాతీయ సాంకేతిక విద్యాసంస్థ యాజమాన్యం వరంగల్లో 8 నెలల క్రితం చేపట్టిన మియావాకి విధానం సత్ఫలితాలనిస్తోంది. మొక్కలన్నీ ఆరడుగులు ఏపుగా పెరిగి విద్యాలయ ప్రాంగణమంతా పచ్చదనం పరుచుకుంది.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న హరితహారంలో భాగంగా మియావాకి విధానంలో తక్కువ విస్తీర్ణంలోనే నిట్ నిర్వాహకుల ఎక్కువ మొక్కలు నాటారు. అటవీ శాఖ సహకారంతో వివిధ రకాల పూలు, పండ్ల మొక్కలు గతేడాది ఆగస్టు 15న పెంచడం ప్రారంభించారు. రెండెకరాల్లోనే 6 వేల మొక్కలు ఏపుగా పెరిగి చిన్నపాటి అడవిలా కనువిందు చేస్తోంది.