Charge Sheet Filed In Medico Preethi Suicide Case : నాలుగు నెలల క్రితం సంచలనం సృష్టించిన వరంగల్‌లో వైద్య విద్యార్ధిని ప్రీతి ఆత్మహత్య కేసులో పోలీసులు చార్జ్ షీట్ దాఖలు చేశారు. సీనియర్ అయిన డాక్టర్ సైఫ్.. ప్రీతిని ర్యాగింగ్ చేశాడని, కులం పేరుతో పలురకాలుగా హేళన చేసే విధంగా మాట్లాడుతూ ఆమెను మానసికంగా ఇబ్బంది పెట్టేవాడని కోర్టుకు సమర్పించిన ఛార్జ్‌షీట్‌లో పోలీసులు పేర్కొన్నారు.
ఆ వేధింపులు భరించలేక ఫిబ్రవరి 22న.. ఆత్మహత్యాయత్నం చేసుకుందని అందులో పొందుపరిచారు. ప్రీతి హైదరాబాద్ నిమ్స్‌లో చికిత్స పొందుతూ అదే నెల 26 న చనిపోయింది. దీనిపై 306, 354 IPC, Sec .4(v) TS Prohibition of Ragging Act, Sec.3(1)(r), 3(1)(w)(ii), 3(2)(v) SC/ST (POA) Act కింద మట్వాడ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఆ వెంటనే నిందితుడు సైఫ్‌ను అరెస్ట్ చేసి జైలుకు తరలించినట్లు పేర్కొన్నారు.
70 మంది సాక్షులను విచారించిన పోలీసులు : ప్రీతి మృతికి కారణం తెలుసుకునేందుకు 70 మంది సాక్షులను విచారించి అన్ని కోణాల్లో దర్యాప్తు చేశారు. తమకు దొరికిన అన్ని మార్గాల్లోనూ అంటే సైంటిఫిక్, టెక్నికల్, మెడికల్, ఫోరెన్సిక్ నిపుణల సహకారముతో మృతురాలు, నిందితుడు, వారి మిత్రులు వాడిన సెల్‌ఫోన్ డేటా ఆధారంగా నిజాలను వెలికితీశారు. ఈ కేసుకు సంబంధించిన అన్ని రకాల సాక్ష్యాధారాలు సేకరించి.. మెడికల్, ఫోరెన్సిక్ నిపుణుల రిపోర్టులు సేకరించి పరిశీలించారు.