మాతృభాషలో బోధిస్తే పిల్లలకు చక్కగా అర్థమవుతుంది. సైన్సు పాఠాలను సైతం మాతృభాషలో నేర్చుకుంటే ఎన్నో ఫలితాలు ఉంటాయి. పెద్దయ్యాక దానిపై పట్టు సాధించి పరిశోధనలవైపు ఆసక్తి చూపే అవకాశం ఉంది. అందుకే కేంద్ర శాస్త్ర సాంకేతిక విభాగం చిన్నారులకు మాతృభాషలోనే సైన్సును భోధించేందుకు బృహత్తర కార్యక్రమాన్ని ప్రారంభించింది.
స్కోప్ ప్రాజెక్టుకు వరంగల్ నిట్ ఎంపిక
దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో మాతృభాషలో శాస్త్ర సాంకేతికత అంశాలను బోధించేందుకు సైన్స్ కమ్యూనికేషన్- పాపులరైజేషన్ అండ్ ఎక్స్‌టెన్షన్ ప్రాజెక్టు(SCOPE)కు శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లోని పాఠశాల స్థాయి నుంచి విశ్వవిద్యాలయ స్థాయి వరకు విద్యార్థులకు తెలుగులో సైన్స్‌ను బోధించేందుకు వరంగల్ జాతీయ సాంకేతిక విద్యా సంస్థకు(Warangal nit) స్కోప్ ప్రాజెక్టు మంజూరైంది. మూడేళ్ల పాటు కొనసాగే ఈ ప్రాజెక్టుకు ఏటా రూ.20 లక్షల నిధులు అందుతాయి. ఈ ప్రాజెక్టు కోర్ కమిటీ ఛైర్మన్‌గా వరంగల్ నిట్ సంచాలకులు వ్యవహరించనున్నారు.