తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని దెబ్బ తీసేలా తెరాస ప్రభుత్వం పని చేస్తోందని కేంద్ర పర్యాటక, సంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. ఆత్మగౌరవం కోసం పోరాటం చేశాం తప్పితే.. కల్వకుంట్ల కుటుంబానికి బానిసలు అయ్యేందుకు కాదన్నారు. తెలంగాణ ధనిక రాష్ట్రామన్న కేసీఆర్ ఏడేళ్లలో వేల కోట్లు అప్పు చేశారని విమర్శించారు. జన ఆశీర్వాదయాత్రలో భాగంగా హనుమకొండ జిల్లా కమలాపూర్‌కు వెళ్లిన కిషన్ రెడ్డికి ఈటల రాజేందర్, విజయరామారావు, చంద్రశేఖర్, తుల ఉమ, ఏనుగు రవీందర్ రెడ్డి ఘనస్వాగతం పలికారు. మహిళలు మంగళ హారతులతో స్వాగతం పలికారు.
ఈటల రాజేందర్‌తో 15 ఏళ్ల అనుబంధం ఉంది. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం హుజూరాబాద్ ప్రజలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. కరోనాను అరికట్టేందుకు ఈటల రాజేందర్ అంకితభావంతో పనిచేశారు. కేసీఆర్ ఎన్నికలు వస్తేనే బయటకు వస్తారు.. లేకపోతే ఫామ్‌హౌస్‌లోనే ఉంటారు. రూ.1900 కోట్లతో వరంగల్ నుంచి హైదరాబాద్ వరకు రోడ్డు వేసిన ఘనత నరేంద్రమోదీది. రూ.6వేల కోట్లతో రామగుండంలో కిసాన్ యూరియాని కేంద్రం ఉత్పత్తి చేస్తోంది. బీసీల హక్కులను కాపాడేందుకు మోదీ కృషి చేస్తున్నారు. తెలంగాణలో మార్పునకు మొదటి అడుగు హుజూరాబాద్ నుంచే పడాలి. 2023లో భాజపా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. హుజూరాబాద్‌లో భాజపా గెలిస్తే.. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు వాళ్ల నియోజకవర్గాల్లో ఓడిపోతారు. తెరాస ఎమ్మెల్యేలు పోతే మంచి పథకాలు వస్తాయని ఆయా నియోజకవర్గాల ప్రజలు కోరుకుంటున్నారు. ఈటల రాజేందర్ ఒక్కడు కాదు.. మేమంతా ఉన్నాం.
-కిషన్ రెడ్డి, కేంద్రమంత్రి