Kishan Reddy fire on TRS: తెరాస, కాంగ్రెస్ పీకేతో కలిసి పనిచేసినా మాకు ఎలాంటి నష్టం లేదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్‌లో అభద్రతా భావం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. హుజూరాబాద్ ఎన్నికల తర్వాత కేంద్రంపై విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. హనుమకొండలో నిర్వహించిన భాజపా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్, తెరాస గతంలో కూడా కలిసి పనిచేశాయని.. వారి గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదన్నారు.
తెరాస ప్రభుత్వం కేంద్రంపై కుట్రలు చేస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ మెప్పు కోసం తెరాస నాయకులు దిగజారి మాట్లాడుతున్నారు. హుజూరాబాద్ ఎన్నికల తర్వాత కేసీఆర్‌లో అభద్రతా భావం పెరిగింది. అందువల్లే గవర్నర్ అవమానించడం, ప్రధాని మోదీని విమర్శిస్తున్నారు. ఏమాత్రం నైతిక విలువలు లేకుండా అబద్ధాలు ఆడుతున్నారు. తెరాస, కాంగ్రెస్ గతంలో కూడా కలిశాయి. కొత్తగా చెప్పాల్సింది ఏమీ లేదు. వారిద్దరూ కలిస్తే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. పీకే వారితో కలిసినా మాకేం నష్టం లేదు. -కిషన్ రెడ్డి, కేంద్రమంత్రి
నిధులిచ్చే విషయంలో కేంద్రం నుంచి రాష్ట్రానికి ఎక్కడా అన్యాయం జరగట్లేదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. తెరాస నాయకులు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని విమర్శించారు. తెరాస నాయకులు దిగజారి గవర్నర్, ప్రధానిని పదే పదే విమర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి ప్రజలే తగిన బుద్ది చెబుతారన్నారు. ప్రశాంత్ కిషోర్ తెరాస, కాంగ్రెస్‌తో పనిచేసినా తమకెలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు.