BRS Mahadharna at Bhupalpally : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్రానికి ఏం చేశారని.. ముఖ్యమంత్రి సహకరించాలని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మంత్రి సత్యవతి రాఠోడ్ ప్రశ్నించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ సెంటర్‌లో సింగరేణి బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణను నిరసిస్తూ బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహా ధర్నాలో ముఖ్య అతిథులుగా మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాఠోడ్‌లు పాల్గొన్నారు. మరికొంత మంది ముఖ్య నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారిరువురు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం, బీజేపీలపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
ఈ మహా ధర్నాలో ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. సింగరేణిని ప్రైవేట్ పరం చేసేందుకే బొగ్గు గనులను వేలం వేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో బొగ్గు గనులపై ఆధారపడి లక్షల మంది కార్మికులు జీవనం సాగిస్తుంటే.. రాష్ట్ర ప్రభుత్వం సహకరించట్లేదని ప్రధానినే చెప్పడం అవివేకమని మంత్రి అన్నారు. తెలంగాణ డబ్బులను తీసుకెళ్లి గుజరాత్‌లో ఖర్చు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. దేశంలో ఏ బొగ్గు గనులకు రాని ఆదాయం.. కేవలం సింగరేణికి మాత్రమే వస్తుందన్నారు.
సింగరేణి బొగ్గును కరెంటుకు ఎందుకు వాడటం లేదు: దేశంలో కరెంటును ఉత్పత్తి చేయడానికి విదేశాల నుంచి దిగుమతి చేస్తున్న బొగ్గును వాడుతున్నారు కానీ దేశీయంగా ఉత్పత్తి అయిన సింగరేణి లాంటి సంస్థల బొగ్గును ఎందుకు వాడటం లేదని ప్రశ్నించారు. వాటిని ప్రైవేటు వ్యక్తులకు ఖర్చు చేసేందుకే ఇలా చేస్తున్నారని విమర్శించారు. ఏ విషయంలో కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి సహకరించాలని ధ్వజమెత్తారు. సింగరేణి కార్మికులకు తెలంగాణ ప్రజలంతా మద్దతుగా ఉన్నారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు భరోసా ఇచ్చారు.