వరంగల్ అర్బన్ జిల్లా ఖిలా వరంగల్ మండలం బొల్లికుంట చెరువు ప్రమాదకర స్థాయికి చేరుకుంది. 160 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో ఉన్న కాకతీయులనాటి చెరువు గత ఐదు రోజులుగా కురుస్తున్న వర్షానికి నిండు కుండలా మారింది. ఎగువన కురిసిన వర్షాలకు వరదనీరు చెరువులోకి భారీగా చేరడంతో మత్తడి దూకుతూ చూపరులను ఆకట్టుకుంటోంది. ప్రవాహం పెరిగితే ఈ మత్తడి మీదుగా పది గ్రామాలకు రాకపోకలు నిలుస్తాయని స్థానికులు పేర్కొన్నారు. చెరువు ఆనకట్ట ఇరుకుగా ఉందని వ్యవసాయ పనులకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తోందని రైతులు వాపోతున్నారు.
ప్రాణాలు అరచేతిలో
అధిక వర్షాలతో నిండిన చెరువుకు ఆనకట్ట సరిగా లేదని కట్ట తెగితే చుట్టు పక్కల గ్రామాలు నీటిలో మునిగిపోతాయని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఎప్పుడు తెగుతుందో అర్థంకాని పరిస్థితి నెలకొందని.. అధికారులు స్పందించి చెరువు ఆయకట్టను బలోపేతం చేయాలని వేడుకుంటున్నారు. 4 అడుగుల మేర మత్తడి దూకుతున్న వర్షపు నీటితో వాగు దాటాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వెళ్లాల్సివస్తోందని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. త్వరితగతిన బొల్లికుంట పెద్ద చెరువును అభివృద్ధి చేసి పర్యాటక ప్రాంతంగా మార్చాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి:RAMAPPA TEMPLE UNESCO: రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు