Bogatha Waterfalls in Telangana :ఛత్తీస్‌గఢ్ అడవుల్లో కురుస్తున్న భారీ వర్షాలకు.. బొగత జలపాతం సరికొత్త అందాలను సంతరించుకుంది. పాల నురుగులా జాలువారుతున్న ప్రవాహాన్ని చూసి పర్యాటకులు పరవశించిపోతున్నారు. రాష్ట్రంలోని పలుచోట్ల నుంచి భారీగా తరలివస్తున్న సందర్శకులు కొండల నుంచి పరుగున్న వస్తున్న జల సవ్వడిని చూసి తన్మయత్వంలో మునిగిపోతున్నారు.
Bogatha Waterfalls Mulugu :ములుగు జిల్లాలో.. తెలంగాణ నయాగారాగా పేరొందినబొగత జలపాతం ప్రకృతి రమణీయత మధ్య ముగ్ధమనోహరంగా మారింది. చుట్టూ ఎత్తైన కొండలు.. దట్టమైన అడవి గుండా ప్రవహిస్తూ వస్తున్నజలపాతం అందాలను చూసి పర్యాటకులు మురిసిపోతున్నారు. వరంగల్‌కి 133 కిలోమీటర్ల దూరంలో సహజసిద్ధ జలపాతాన్ని చూసేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి విశేషంగా తరలిస్తున్నారు. ములుగు జిల్లా వాజేడు మండలం చీకుపల్లి అటవీ ప్రాంతంలోని జలపాతానికి.. ఈ ఏడు కాస్త ఆలస్యంగా జలకళ వచ్చింది. భారీ వర్షాలకు గంగమ్మ ధారలు బొగత కనుమల్లో కనువిందు చేస్తున్నాయి. పెద్ద సంఖ్యలో సందర్శకులు వచ్చి బొగత సహజ అందాలను మనసారా ఆస్వాదిస్తూ మరిచిపోలేని మధురస్మృతులను మూటగట్టుకెళుతున్నారు.
Bogatha Waterfalls Visitors :కొండకోనల్లో నుంచి వడివడిగా పడుతూ నేలను తాకుతున్న జలధారలను చూసి మురిసిపోతున్నారు. కుటుంబసమేతంగా పిల్లాపాలతో విచ్చేసి.. సమీప జలాల్లో జలకాలాడుతూ సరదాగా గడుపుతున్నారు. నిత్యం ఉండే పనిఒత్తిడిని మరిచిపోడానికి బొగత జలపాతాన్ని చూస్తే సరిపోతుందని ఆనందంతో చెబుతున్నారు. అంత ఎత్తునుంచి దూకుతుంటే వస్తున్న జలసవ్వళ్లు.. ఆ తుంపరలను చూసి సాంత్వన పొందుతున్నారు.