వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ వ్యవసాయ మార్కెట్‌లో శనివారం స్వయం సహాయక సంఘాలకు వడ్డీలేని రుణాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుతో పాటు ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిలు హాజరయ్యారు. ఇదే కార్యక్రమానికి భాజపాకు చెందిన స్థానిక ఎంపీపీ తడక రాణి హాజరయ్యారు. అయితే కార్యక్రమంలో ప్రోటోకాల్ పాటించకుండా తెరాస నాయకులు ఎంపీపీని అవమానించారు. పలువురు ఆమెను దూషిస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారు.
దీనిని నిరసిస్తూ మండల కేంద్రంలో నేడు భాజపా నాయకులు ఆందోళనకు దిగారు. కార్యక్రమంలో భాజపా మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు గీతామూర్తి, వరంగల్ అర్బన్ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ, మాజీ మంత్రి ఈటల రాజేందర్ సతీమణి ఈటల జమున, మాజీ ఎమ్మెల్యే బోడిగ శోభ, మాజీ జడ్పీ ఛైర్‌పర్సన్ తుల ఉమలు పాల్గొన్నారు. తెరాస ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
స్థానిక అంబేడ్కర్ కూడలి వద్ద చేపట్టిన ఈ ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేసే క్రమంలో పోలీసులు, భాజపా నాయకులకు మధ్య తోపులాట జరిగింది. ఘర్షణలో భాజపాకు చెందిన ఓ సీనియర్ నాయకుడు గాయపడటంతో అతడిని ఆందోళన నుంచి పక్కకు తప్పించారు.