Bandi Sanjay Says BJP Gain Power In Telangana : రాష్ట్రంలో కిషన్ రెడ్డి నాయకత్వంలో కేసీఆర్ గడీలు బద్దలు కొడతామని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో కాషాయరాజ్యం తెచ్చేందుకు అంతా కలసి కట్టుగా కృషి చేయాలని.. బీజేపీ శ్రేణులకు సూచించారు. హనుమకొండలో జరిగిన బీజేపీ విజయ సంకల్ప సభలో పాల్గొన్న బండి సంజయ్.. బీఆర్ఎస్ పార్టీపై విమర్శలు గుప్పించారు.
రాష్ట్రంలో ఇప్పుడు సుమారు రూ.6 వేల కోట్లకు పైగా అభివృద్ధి పనులను ప్రారంభించిన ప్రధాని మోదీకి ఎంపీ బండి సంజయ్ ధన్యవాదాలు తెలిపారు. ఇందుకు కరీంనగర్ పార్లమెంటు ప్రజల తరఫున ధన్యవాదాలు చెప్పుతున్నామని అన్నారు. ఏం ముఖం పెట్టుకుని మోదీ.. రాష్ట్రానికి వస్తున్నారని కొందరు ప్రశ్నించారని మండిపడ్డారు. వారందరికీ ఒకటే చెపుతున్నానని.. 10 వేల మంది వరకు ఉపాధి కల్పించేందుకే మోదీ వచ్చారని స్పష్టం చేశారు. అలాగే వరంగల్‌ను స్మార్ట్ సిటీ చేసేందుకే ప్రధాని వచ్చారన్నారు. ప్రధాని కార్యక్రమానికి వచ్చేందుకు కేసీఆర్‌కు ముఖం లేదని.. మోదీ వస్తే కేసీఆర్‌కు కొవిడ్, జ్వరం వస్తోందని బండి సంజయ్ విమర్శించారు.
Bandi Sanjay Comments On BRS : పార్టీ నాకు అనేక అవకాశాలు కల్పించిందని మాజీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవి సహా ఎన్నో అవకాశాలు తనకు కల్పించారని చెప్పారు. ప్రధాని తన భుజం తట్టారని.. ఇంతకు మించి ఇంకేం కావాలని బండి సంజయ్ హర్షం వ్యక్తం చేశారు. ప్రపంచమే బాస్‌గా గుర్తించిన నేత.. ప్రపంచ దేశాలే పాదాభివందనం చేసే నేత మోదీ అని బండి సంజయ్ కొనియాడారు.