తెలంగాణ

telangana

ETV Bharat / state

BJP Nirudyoga March: TSPSC లీకేజీని నిరసిస్తూ నేడు బీజేపీ నిరుద్యోగ మార్చ్ - వరంగల్‌లో నేడు బీజేపీ నిరుద్యోగ మార్చ్

BJP Nirudyoga March in Warangal: టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రం లీకేజీని నిరసిస్తూ బీజేపీ నేడు నిరుద్యోగ మార్చ్‌కు పిలుపునిచ్చింది. పోరాటాల పురిటిగడ్డ ఓరుగల్లు వేదికగా కాకతీయ విశ్వవిద్యాలయం క్రాస్‌రోడ్‌ నుంచి.. అంబేడ్కర్ విగ్రహం వరకు మార్చ్ నిర్వహించనున్నట్లు ప్రకటించింది. సాయంత్రం 4 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో వేలాది మంది యువకులు పాల్గొంటారని బీజేపీ నేతలు వెల్లడించారు.

BJP Nirudyoga March in Warangal
BJP Nirudyoga March in Warangal

By

Published : Apr 15, 2023, 7:12 AM IST

BJP Nirudyoga March in Warangal: తెలంగాణ గడ్డపై కాషాయజెండా ఎగుర వేయడమే లక్ష్యంగా దూసుకెళ్తున్న బీజేపీ.. టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రం లీకేజీని ఒక అస్త్రంగా మల్చుకుంది. ప్రశ్నపత్రం లీకేజీ బయటకు వచ్చినప్పటి నుంచి.. వివిధ రూపాల్లో ఆందోళనలు నిర్వహిస్తోంది. పేపర్‌ లీకేజీ వ్యవహారానికి సంబంధించి సిట్టింగ్ జడ్జి లేదా సీబీఐతో విచారణ జరిపించాలని, మంత్రి కేటీఆర్‌ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేయాలని, నష్టపోయిన నిరుద్యోగులకు రూ.లక్ష చొప్పున పరిహారంగా ఇవ్వాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఈ మూడు అంశాలనే ప్రధాన అజెండాగా.. అన్ని విశ్వవిద్యాలయాలు, కోచింగ్‌ సెంటర్లకు బీజేపీ టాస్క్‌ఫోర్స్‌ కమిటీ వెళ్లి నిరుద్యోగులను చైతన్యవంతులను చేస్తూ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది.

మలి దశ తెలంగాణ ఉద్యమంలో కీలక ఘట్టమైన మిలియన్‌ మార్చ్‌ తరహాలో నిరుద్యోగ మార్చ్‌ నిర్వహించేందుకు సిద్ధమైంది. నేడు ఉమ్మడి వరంగల్‌ జిల్లా కేంద్రంగా కాకతీయ విశ్వవిద్యాలయం కూడలి నుంచి అంబేడ్కర్ విగ్రహం వరకు వేలాది మందితో నిరుద్యోగ మార్చ్ చేపట్టనుంది. నిరుద్యోగ మార్చ్‌ కోసం కమలనాథులు.. వరంగల్‌కు తరలివస్తున్నారు. ఆ మార్చ్‌లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో పాటు.. రాష్ట్ర నాయకత్వం అంతా పాల్గొననుంది. మార్చ్‌ సందర్భంగా ఉద్యోగ నియామకాలపై రాష్ట్రప్రభుత్వానికి బీజేపీ నేతలు అల్టిమేటం జారీ చేయనున్నారు. ఉస్మానియా, కాకతీయ యూనినర్సిటీల జేఏసీ.. నిరుద్యోగ మార్చ్‌కు సంఘీభావం ప్రకటించాయి. యూనివర్సిటీకి వెళ్లే మార్గాన్ని పూర్తిగా కాషాయమయంగా తీర్చిదిద్దారు. భారీ ఫ్లెక్సీలు, బ్యానర్లను ఏర్పాటు చేశారు.

అన్ని ఉమ్మడి జిల్లాల్లోనూ..: వరంగల్‌ జిల్లాలో నిరుద్యోగ మార్చ్‌ తర్వాత అన్ని ఉమ్మడి జిల్లాల్లో ఆ కార్యక్రమాన్ని నిర్వహించేలా బీజేపీ సన్నాహాలు చేస్తోంది. ఈ నెల 18న మహబూబ్‌నగర్‌లో నిరుద్యోగ మార్చ్ నిర్వహించనున్నట్లు బండి సంజయ్ ప్రకటించారు. అనంతరం ఖమ్మంతో పాటు ఇతర జిల్లాల్లోనూ జరిపేందుకు బీజేపీ నేతలు కసరత్తు చేస్తున్నారు. నిరుద్యోగ మార్చ్‌ దృష్ట్యా మధ్యాహ్నం 3 గంటల నుంచే యూనివర్సిటీ మార్గంలో ట్రాఫిక్‌ను మళ్లించనున్నారు.

ముందు జిల్లాల్లో.. తర్వాత హైదరాబాద్‌లో..: టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీపై బీజేపీ ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్ కమిటీ ఇటీవల హైదరాబాద్​లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సమావేశమైంది. ఈ క్రమంలోనే లీకేజీపై పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేయాలని మీటింగ్‌లో నిర్ణయించారు. ఇందులో భాగంగానే ముందుగా జిల్లాల వారీగా మార్చ్ నిర్వహించి.. ఆ తర్వాత హైదరాబాద్​లో కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించారు.

ఇవీ చూడండి..

'జిల్లాల వారీగా నిరుద్యోగ మార్చ్.. ఆ తరువాత హైదరాబాద్​లో... '

TSPSC పేపర్ లీకేజీ కేసులో సిట్ దర్యాప్తు.. క్వశ్చన్ పేపర్లు ఎవరెవరికి చేరాయి..?

ABOUT THE AUTHOR

...view details