తెరాస ఎమ్మెల్యే ఇంటిపై కోడిగుడ్లతో భాజపా శ్రేణుల దాడి - ఎమ్మెల్యే నరేందర్ తాజా వార్తలు
19:55 July 13
వరంగల్ అర్బన్ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ ఇంటిపై దాడి
భారతీయ జనతా పార్టీ నిజామాబాద్ ఎంపీ అర్వింద్‌పై జరిగిన దాడికి నిరసనగా వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ ఇంటిపై భాజపా కార్యకర్తలు కోడిగుడ్లతో దాడి చేశారు. ప్రజా ప్రతినిధులు హోదా మరిచి రౌడీలను పురమాయించి దాడులు చేయించడం సిగ్గుచేటని భాజపా కార్యకర్తలు విమర్శించారు.
కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ కట్టడి చేయాల్సిన ప్రజాప్రతినిధులు మూకుమ్మడి దాడులు చేయించడం బాధాకరమని తెలిపారు. ఎంపీ అర్వింద్ కాన్వాయ్‌ని అడ్డుకుని దాడులు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. 24 గంటలు గడిచినా నిందితులపై ఎలాంటి చర్యలు చేపట్టలేదని, పైగా ఉదయం నుంచే భాజాపా కార్యకర్తలను ముందస్తు అరెస్టులు చేయడం హేయమైన చర్యన్నారు. ఇదిలా ఉంటే ఎమ్మెల్యే నరేందర్ ఇంటిని ముట్టడించిన భాజపా కార్యకర్తలను మిల్స్ కాలనీ పోలీసులు అరెస్టు చేశారు.