Bhadrakali Lake Damage : వరద సృష్టించిన బీభత్సం కళ్ల ముందు కదులుతుండగానే.. ఓరుగల్లులో భద్రకాళీ చెరువు పరివాహక ప్రాంతాల ప్రజలు ఒక్కసారిగా హడలిపోయారు. వరదల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తరుణంలో భద్రకాళీ చెరువుకు గండిపడిందన్న వార్తతో ఆందోళనకు గురయ్యారు. చెరువుకు పోటెత్తిన వరదతో.. పోతననగర్ వైపు ఉన్న చెరువు కట్టకు గండి పడింది. దీంతో అక్కడి నుంచి ఒక్కసారిగా వరద పోటెత్తింది.
Bhadrakali temple Pond Damage : నీళ్లు దిగువ కాలనీలను చుట్టుముట్టక ముందే అప్రమత్తమైన అధికారులు.. దిగువ ప్రాంత కాలనీ వాసులను ఖాళీ చేయించారు. పోతననగర్, సరస్వతీనగర్, కాపువాడ కాలనీ ప్రజలతో పాటు రంగపేటవాసులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వరంగల్ కార్పొరేషన్ మేయర్ గుండు సుధారాణి, కలెక్టర్ సిక్తా పట్నాయక్, పోలీస్ కమిషనర్ రంగనాథ్ ఘటనా స్థలిని పరిశీలించి ప్రజలను అప్రమత్తం చేశారు.
చెరువుకు గండిపడిన ప్రాంతంలో ఇసుక బస్తాలు వేసి మరమ్మతులు చేపట్టారు. జేసీబీలతో భద్రకాళీ బండ్ నిర్మాణంలో భాగంగా నిర్మించిన కాల్వలోకి నీటిని మళ్లించారు. చెరువు గండిపడిన ప్రాంతానికి వచ్చిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఆక్రమణల వల్లే ఈ పరిస్థితి వచ్చిందని.. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు రాకుండా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు. మరోవైపు.. భద్రకాళీ చెరువు కట్ట పరిస్థితిని బీజేపీ, కాంగ్రెస్ నేతలు సైతం పరిశీలించారు.
ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఉమ్మడి వరంగల్..: రాష్ట్రంలో భారీ వర్షాలతో చిగురుటాకులా వణికిన ఉమ్మడి వరంగల్ జిల్లా.. వానలు కాస్త తగ్గుముఖం పట్టడంతో ఇప్పుడిప్పుడే మెల్లిమెల్లిగా కోలుకుంటోంది. శుక్రవారం నుంచి వరుణుడు కరుణించినా.. వరద కొనసాగుతుండటంతో పలు లోతట్టు ప్రాంతాలు ఇంకా జల దిగ్భందంలోనే ఉన్నాయి. నాలాల నుంచి కొట్టుకొచ్చిన చెత్తా-చెదారంతో వీధులన్నీ అపరిశుభ్రంగా కనిపిస్తున్నాయి. హనుమకొండ, మహబూబాబాద్లలోనూ పరిస్థితులు ఇలాగే ఉండగా.. ఇళ్లలోకి చేరిన బురదతో జనం నానా ఇబ్బందులు పడుతున్నారు.