తెలంగాణ

telangana

ETV Bharat / state

ఓరుగల్లు మణిహారం.. భద్రకాళీ బండ్​

చారిత్రక నగరంగా ఖ్యాతి పొందిన ఓరుగల్లు నగరానికి భద్రకాళీ బండ్... కొత్త అందాలు తీసుకొస్తోంది. వరంగల్ వాసుల ఇలవేల్పు.. భద్రకాళీ అమ్మవారి ఆలయం పక్కనే.. అమ్మవారి పేరుతోనే రూపుదిద్దుకున్న భద్రకాళీ బండ్ ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఓరుగల్లుకు మణిహారంగా మారిన భద్రకాళీ బండ్​ నగరవాసులతో పాటు పర్యటకులను ఆకట్టుకోనుంది.

భద్రకాళీ బండ్​

By

Published : Oct 4, 2019, 2:20 PM IST

భద్రకాళీ బండ్​

వరంగల్ భద్రకాళీ బండ్ సర్వాంగ సుందరంగా ముస్తాబై ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఓరుగల్లుకు మణిహారంగా మారిన భద్రకాళీ బండ్​ నగరవాసులతో పాటు... పర్యటకులనూ ఆకట్టుకోనుంది. మంత్రిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన అనంతరం... తొలిసారిగా నగరానికి విచ్చేస్తున్న ఐటీ, పట్టణాభివృద్ధి, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ భద్రకాళీ బండ్​ను శనివారం లాంఛనంగా ప్రారంభించనున్నారు.

కాకతీయ వైభవం ఉట్టిపడేలా

హృదయ్ పథకంలో భాగంగా 25 కోట్ల రూపాయల వ్యయంతో.... కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో భద్రకాళీ బండ్​ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దింది. మొదటి దశలో 1.1 కిలోమీటర్ల మేర బండ్​ను నిర్మించారు. కాకతీయుల కళా వైభవం ఉట్టిపడేలా రాతి కట్టడాలతో.... ఆకర్షణీయంగా నిర్మాణం చేశారు. నగర వాసుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని.... బండ్ పైన ప్రశాంతగా నడక సాగించేందుకు.. ప్రత్యేకంగా సింథటిక్ వాకింగ్ ట్రాక్, వ్యాయామ పరికరాలు ఏర్పాటు చేశారు.

విద్యుత్​దీపాల ధగధగలు

పర్యటకులకు ఆహ్లాదం కలిగించేలా రంగురంగుల పూల మొక్కలు నాటారు. ఇక రాత్రి పూట విద్యుత్​ కాంతుల ధగధగలతో భద్రకాళీబండ్​ అందాలు రెట్టింపువుతున్నాయి. రంగురంగుల విద్యుత్​ దీపాలు, ఫౌంటెన్లు సందర్శకులను కట్టిపడేస్తున్నాయ్.
ఓరుగల్లుకు మరో ఆకర్షణ

మొదటి దశలో పూర్తైన భద్రకాళీ బండ్​ను మంత్రి కేటీఆర్​ ప్రారంభిస్తారు. రూ.66 కోట్లతో నాలుగు కిలోమీటర్ల మేర నిర్మించనున్న రెండో దశ పనులకు శ్రీకారం చుడతారు. చారిత్రక నగరంగా భాసిల్లే ఓరుగల్లుకు భద్రకాళీ బండ్​ మరో ఆకర్షణగా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

ABOUT THE AUTHOR

...view details