చారిత్రక ఓరుగల్లులో బతుకమ్మ చీరల తయారీ బంగారు బతుకమ్మ పండుగకు తెలంగాణ సర్కార్ రాష్ట్రంలోని ఆడపడుచులకు బతుకమ్మ చీరల(Bathukamma Sarees)ను కానుకగా అందించడం ఆనవాయితీ. తీరొక్క డిజైన్లలో.. అలరించే రంగుల్లో ఉండే ఈ చీరలు మహిళలను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. సాధారణంగా.. బతుకమ్మ చీరలు ఎప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లాలోనే తయారయ్యేవి. కానీ.. ఈ సారి ఓరుగల్లులోనూ వీటిని రూపొందిస్తున్నారు.
ఇప్పుడు ఓరుగల్లులోనూ..
సిరిసిల్లలో తయారయ్యే బతుకమ్మ చీరలు(Bathukamma Sarees)... ఇప్పుడు ఓరుగల్లులోనూ రూపుదిద్దుకుంటున్నాయి. చూడచక్కని డిజైన్లతో నేత కార్మికులు వీటిని తయారు చేస్తున్నారు. మడికొండ వద్ద ఉన్న కాకతీయ మినీ జౌళి పార్కుకు పన్నెండున్నర లక్షల మీటర్ల భారీ ఆర్డర్ రావడంతో... ఉత్సాహంగా చీరలను నేస్తున్నారు. మరో రెండు నెలల్లో బతుకమ్మ పండగ వస్తోంది. బతుకమ్మ వేడుకకి ఆడపడుచులకు కానుకగా ఇచ్చేందుకు ఈ చీరలు సిద్ధమవుతున్నాయి.
40కి పైగా యూనిట్లలో..
మడికొండ వద్ద ఉన్న కాకతీయ మినీ జౌళి పార్కుకు ప్రభుత్వం పన్నెండున్నర లక్షల మీటర్ల భారీ ఆర్డర్ ఇచ్చింది. చేనేత కళాకారులు హుషారుగా చీరలను నేస్తున్నారు. రాష్ట్రంలో పని దొరక్క మహారాష్ట్ర భీవండి సహా ఇతర ప్రాంతాలకు కార్మికులు వలస వెళ్లేవారు. అలాంటి వారిని ప్రభుత్వం తిరిగి తీసుకొచ్చి ఆర్థికసాయం అందించింది. ప్రభుత్వ సాయంతో మడికొండలోని 66 ఎకరాల్లో మొత్తం 364 యూనిట్లు ఏర్పాటు చేశారు. 40కి పైగా యూనిట్లలో ప్రస్తుతం బతుకమ్మ చీరలు(Bathukamma Sarees) నేస్తున్నారు. ఆకట్టుకునే రంగల్లో తయారవుతున్న బతుకమ్మ చీరలు....త్వరలోనే మహిళలకు అందనున్నాయి.