తెలంగాణ

telangana

ETV Bharat / state

నేటితో ముగియనున్న బతుకమ్మ వేడుకలు.. సద్దుల బతుకమ్మకు సర్కార్​ ప్రత్యేక ఏర్పాట్లు

Saddula Bathukamma celebrations: తొమ్మిది రోజుల పాటు సందడిగా సాగిన.. బతకుమ్మ పండుగ వేడుకలు నేటితో ముగియనున్నాయి. రాష్ట్రమంతా సద్దుల బతుకమ్మకు సర్వం సిద్దమైంది. ఓరుగల్లులో ఆలయాలు, చెరువుల వద్ద అధికారులు సద్దుల బతుకమ్మ కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తి శ్రద్ధలతో గౌరమ్మ తల్లికి పూజలు చేసి మహిళలు బతుకమ్మలను నీటిలో నిమజ్జనం చేస్తారు.

Bathukamma celebrations
Bathukamma celebrations

By

Published : Oct 3, 2022, 6:53 AM IST

నేటితో ముగియనున్న బతుకమ్మ వేడుకలు.. సద్దుల బతుకమ్మకు ప్రత్యేక ఏర్పాట్లు చేసిన సర్కారు

Saddula Bathukamma celebrations: తెలంగాణ సంస్కృతి సంప్రదాయలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ వేడుకలు ముగింపు దశకు చేరుకున్నాయి. తొలి రోజు ఎంగిల పూల బతుకమ్మలతో ప్రారంభమైన ఈ పండుగ వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగానే కాదు .దిల్లీ, ఇతర రాష్ట్రాల్లు సహా విదేశాల్లోనూ సందడిగా సాగాయి. పట్టణాలు. పల్లెలు, ధనిక పేదా అన్న తేడా లేకుండా మహిళలు ఉత్సాహంగా పాల్గొని ఆటపాటలతో హోరెత్తించారు. తీరొక్క పూలను సేకరించి అందంగా పేర్చి కూర్చి సంబురాల్లో పాల్గొన్నారు.

ఓరుగల్లులో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు:పండుగ సంబురాలతో ఇళ్లన్నీ పూలవనాలుగా మారాయి. బతుకమ్మ పాటలతో వీధులన్నీ మారుమ్రోగాయి. పుట్టింటికి వచ్చిన సంతోషం ముఖంలో తొణికసలాడుతుంటే పడతులు.. 8 రోజుల పాటు పండుగలో పాల్గొన్నారు. ఇక ఇవాళ ఆఖరి రోజు సాయంత్రం జరిగే సద్దుల బతుకమ్మ వేడుకలు తారాస్థాయికి చేరుకుంటాయి. 8 రోజుల సందడి ఈ ఒక్క రోజులోనే కనపడుతుంది. ఇప్పటికే వనితలంతా బతుకమ్మలను పేర్చడంలో తలమునకలైయ్యారు.

అలుపు ఆయాసం లేకుండా నెత్తిన పెద్ద పెద్ద బతుకమ్మలు తెచ్చి ఆలయాలు, చెరువులు, కుంటలు, కూడళ్ల వద్దకు చేరి ఆటలు ఆడి పాటలు పాడి భక్తిశ్రద్దలతో గౌరమ్మ తల్లికి పూజలు చేసి నైవేద్యాలను సమర్పించిన అనంతరం బతుకమ్మలను నీళ్లలో నిమజ్జనం చేయడంతో పర్వదినం ముగుస్తుంది.

పద్మాక్షిగుండం వద్ద అన్ని ఏర్పాట్లు పూర్తి: పాల్గుంటారు ఓరుగల్లులో సద్దుల బతుకమ్మ వేడుకలకు జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రధానంగా హనుమకొండ పద్మాక్షిగుండం వద్ద వేలాది మంది మహిళలు సద్దుల బతుకమ్మ వేడుకల్లో పాల్గొననుండటంతో జిల్లా యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. విద్యుద్దీపకాంతులతో పద్మాక్షి గుండం పరిసరాలు ధగథగలాడుతున్నాయి. బతుకమ్మలు నిమజ్జనం చేసే ప్రాంతాల్లో ఎలాంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా అధికారులు అన్ని జాగ్రత్తలు చేపట్టారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details