Ramappa Temple: శిల్పసంపదకు చిరునామాగా నిలిచిన రామప్ప ఖ్యాతి, యునెస్కో గుర్తింపుతో విశ్వవ్యాప్తమైంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇతర కట్టడాలను తోసిరాజంటూ రామప్ప గతేడాది ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తింపు సొంతం చేసుకుంది. నిత్యం ఎంతో మంది పర్యాటకులు అత్యద్భుతమైన ఈ కట్టడ అందాలు వీక్షించి పులకరించిపోతున్నారు. సహజత్వాన్ని పోలిన శిలా ప్రతిమలు చూసి ఔరా అనకుండా ఉండలేకపోతున్నారు.
అవగాహన సదస్సుకు మంచి స్పందన: నల్లరాతి నిగారింపులు, ఒకదానిని మించి మరొకటి శిల్పకళాకృతులు.. పర్యాటకులను కన్నార్పకుండా చేస్తున్నాయంటే అతిశయోక్తి కాదు. రామప్ప ఆలయ పరిరక్షణ, సంరక్షణ, ప్రచారం తదితర అంశాలపై యునెస్కో చేసిన కొన్ని సూచనలకు అనుగణంగా.. కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన సదస్సుకు మంచి స్పందన కనిపించింది. విద్యార్ధులు, యువత, మేధావులు, అర్చకులు, వివిధ శాఖల అధికారులు, పాలంపేట గ్రామస్తులు రెండు వందల మంది వరకూ.. ఈ సదస్సులో ఉత్సాహంగా పాల్గొన్నారు.
వివిధ అంశాలపై నిపుణుల వివరణ: రామప్ప వైభవం, విశిష్టత, ఆలయాన్ని ఎలా కాపాడుకోవాలి.. ఇక్కడికి వచ్చే పర్యాటకులతో ఎలా మెలగాలి మొదలైన అంశాలపై నిపుణులు సోదాహరణంగా వివరించారు. ఎన్నో ప్రత్యేకతలున్న ప్రాచీన కట్టడ వైభవాన్ని భావితరాలకు అందచేసే బాధ్యతను తీసుకోవాలని సూచించారు. రామప్ప వైభవం, విశిష్టతలపై పలు రాష్ట్రాల నుంచి ఎంపిక చేసిన వాలంటీర్లకు సెప్టెంబర్లో 11 రోజులపాటు శిక్షణ ఇచ్చారు. ఇప్పుడు స్ధానికులు, పరిసర ప్రాంత వాసులకు రెండ్రోజుల అవగాహన సదస్సు నిర్వహించారు. ఆలయ పరిరక్షణలో భాగంగా నిర్వహించే ఈ సమావేశాలు, సదస్సుల వివరాలను.. నివేదిక రూపంలో పొందుపరిచి డిసెంబర్ 1న యునెస్కోకు పంపిస్తారు.