వరంగల్ నగరంలో మంత్రి కేటీఆర్ పర్యటించనున్న నేపథ్యంలో అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. నగరవాసులకు ఇంటింటికీ తాగునీరందించే బృహత్ పథకాన్ని మంత్రి ప్రారంభించనున్నారు. గ్రేటర్ వరంగల్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలంటూ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు.
సర్వాంగ సుందరంగా..
గ్రేటర్ ఎన్నికలు ముంగిట నిలిచిన వేళ రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ వరంగల్లో పర్యటించనున్నారు. సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో మంత్రి సుడిగాలి పర్యటన చేపట్టనున్నారు. దాదాపు రూ.1500 కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభించనున్నారు. ఇందుకు సంబంధించిన పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. పార్కులు, జంక్షన్లను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. భద్రకాళి బండ్, పద్మాక్షిగుట్ట వద్ద సరిగమపదనిస పార్కు, బాలసముద్రంలోని పార్కులను ముస్తాబు చేశారు.
అభివృద్ధి పనులకు శ్రీకారం
వరంగల్ నగరవాసులకు ఇకపై మంచినీటి సమస్య తీరనుంది. దాదాపు రూ.వెయ్యికోట్లతో మిషన్ భగీరథ ద్వారా నీరందించే పథకాన్ని ఉగాది కానుకంగా మంత్రి ప్రారంభించనున్నారు. లబ్ధిదారులకు రెండుపడక గదుల ఇళ్లు, రెండెకరాల స్ధలంలో రూపుదిద్దుకుంటున్న సమీకృత మార్కెట్లు మొదలైన అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు.