పచ్చదనానికి పెద్దపీట వేయాలన్న సర్కార్ ఆదేశం మేరకు వరంగల్ జిల్లాలో వర్షాకాలంలో హరితహారంలో నాటేందుకు పట్టణాల్లోని నర్సరీల్లో మొక్కలను పెంచుతున్నారు. పెంచే మొక్కల్లో దోమలను దూరం చేసే ఔషధ గుణాలున్న తులసి లాంటి వాటికి ప్రాధాన్యం ఇస్తున్నారు. జనగామ పురపాలికలోని నర్సరీలో లక్ష మొక్కలను పెంచుతుండగా అందులో 50 వేల తులసి మొక్కలను పెంచుతున్నారు. కొవిడ్-19 మహమ్మారి వల్ల కొన్ని కొత్త పురపాలికల్లో నర్సరీలను ఏర్పాటుచేయడం సాధ్యం కాలేదు. గ్రామీణాభివృద్ధి శాఖతో అనుసంధానమై పలు గ్రామాల్లో మొక్కలను పెంచుతున్నారు.
పట్నానికి పచ్చ పందిరి వేద్దాం... - warangal haritha haram
కొత్త పురపాలక చట్టంలో పచ్చదనానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇచ్చింది. ప్రతి నగరపాలిక, పురపాలికల్లో పచ్చదనానికి పెద్ద పీట వేయాలని మార్గదర్శకాలు జారీచేసింది. మున్సిపాలిటీ ఆదాయంలో పది శాతం గ్రీన్ ఫండ్ కోసం కేటాయించాలని సూచించింది.
పట్నానికి పచ్చ పందిరి వేద్దాం...
వరంగల్ నగర పాలక సంస్థ పరిధిలో ఈసారి దాదాపు 30 లక్షల మొక్కలను నాటేందుకు రంగం సిద్ధమవుతోంది. కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ, మహానగర పాలక సంస్థలు ఈ మేరకు నర్సరీల్లో మొక్కలను పెంచుతున్నాయి. వరంగల్ కేంద్ర కారాగారంలోనే ఏకంగా 15 లక్షల మొక్కలను పెంచుతున్నారు. ఇందులో 30 వేల వరకు తులసి మొక్కలను పెంచుతున్నారు. భట్టుపల్లి, మడిపల్లిలో లక్షలాది మొక్కలను పెంచుతున్నారు. జీడబ్ల్యూఎంసీ ఈ ఏడాది నర్సరీల పెంపకం, హరిత హారం కార్యక్రమానికి రూ. 2 కోట్ల వరకు కేటాయిస్తోంది.
వినూత్న ఆలోచనతో..
- జనగామ పట్టణంలో నీటి సమస్య తలెత్తకుండా మున్సిపల్ వాటర్ ఫిల్టర్ వద్దే అర ఎకరంలో నర్సరీని ఏర్పాటు చేశారు. దోమల నివారణ కోసం సుమారు 50 వేల తులసి మొక్కలను పెంచుతున్నారు.
- భూపాలపల్లి పట్టణంలో నర్సరీకి మూడెకరాల స్థలం గుర్తించారు. రూ.15 లక్షల వ్యయంతో సుమారు రెండు లక్షల మొక్కలను నాటాలని లక్ష్యం పెట్టుకున్నారు. కొన్ని విత్తనాల రూపంలో, కొన్నింటిని కడియం నర్సరీ నుంచి తెప్పించేందుకు నిర్ణయించారు.
- నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలో ఈ ఏడాది అటవీ, గ్రామీణాభివృద్ధి శాఖ వారు పెంచే నర్సరీల నుంచి మొక్కలను తేనున్నారు. ప్రతి ఇంటికీ రెండు కృష్ణ తులసి మొక్కలను పంపిణీ చేయనున్నారు.
- వర్ధన్నపేట పురపాలికలో ఇల్లందతోపాటు, మరో గ్రామ పంచాయతీ నర్సరీ నుంచి మొక్కలను సేకరించనున్నారు.
- పరకాల మున్సిపాలిటీలో చలివాగు పంపుహౌస్ వద్ద నర్సరీ కోసం స్థలాన్ని గుర్తించారు.
- మరిపెడ మున్సిపాలిటీలో అడుగడుగునా మొక్కలు పెంచాలని లక్ష్యం పెట్టుకున్నారు.
- మహబూబాబాద్ పురపాలికలో లాక్‌డౌన్ తర్వాత దీనిపై కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయనున్నారు.
- తొర్రూరు పట్టణంలో తాత్కాలికంగా యతిరాజారావు పార్కులో మొక్కలను పెంచనున్నారు.