ఎట్టి పరిస్థితుల్లోనూ భూ వివాదాలకు దూరంగా ఉండాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ప్రమోద్ కుమార్ అధికారులకు సూచించారు. వీటి జోలికి వెళ్తే చిక్కుల్లో పడాల్సి వస్తుందన్నారు. ముఖ్యంగా సివిల్ కేసుల పట్ల అప్రమత్తంగా ఉంటూ.. వీలైనంత వరకు వాటిలో తల దూర్చవద్దన్నారు. ఏమైనా భూ సమస్యలు ఉంటే ఇరువర్గాలను కోర్టుకు వెళ్లి పరిష్కరించుకోమని పోలీసులు సూచించాలన్నారు. భూ తగదాల పేరిట ఎవరైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే వారిని అదుపులోకి తీసుకోవాలన్నారు.
భూ వివాదాల జోలికి వెళ్లొద్దు: సీపీ ప్రమోద్ కుమార్
సివిల్ కేసుల్లో పోలీసులు జోక్యం చేసుకోవద్దని వరంగల్ పోలీస్ కమిషనర్ ప్రమోద్ కుమార్ సూచించారు. భూ తగదాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇలాంటి సమస్యలను కోర్టులో పరిష్కరించుకోవాలని పోలీసులు వారికి తెలపాలన్నారు. వీటిలో మధ్యవర్తిత్వం వహించే రౌడీషీటర్ల పట్ల కఠినంగా వ్యవహరించాలన్నారు.
రౌడీ షీటర్ల పట్ల కఠినంగా వ్యవహరించాలి:
భూ తగదాల్లో మధ్యవర్తిత్వం వహించే రౌడీషీటర్ల పట్ల కఠినంగా వ్యవహరించాలని పోలీసులకు సూచించారు. ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే వారిపై పీడీయాక్ట్ కేసులు నమోదు చేయాలన్నారు. స్టేషన్ల వారిగా గుర్తించి వారికి కౌన్సిలింగ్ ఇవ్వాలన్నారు. ప్రధానంగా నకిలీ భూ దస్తావేజులు తయారు చేసే వారిని గుర్తించాలన్నారు. గతంలో ఇలాంటి చర్యలకు పాల్పడిన వారితో పాటు, కమిషనరేట్ పరిధిలో నకిలీ పత్రాలు తయారు చేసే వారి వివరాలు సేకరించాలని అధికారులను సీపీ ఆదేశించారు.