kakatiya medical college corona cases: వరంగల్ కాకతీయ వైద్యకళాశాలపై కరోనా పంజా విసురుతోంది. కళాశాలలో పాజిటివ్ కేసులు క్రమంగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే 22 మంది వైద్య విద్యార్థులు కరోనా బారినపడ్డారు. తాజాగా మరో 20 మందికి కూడా వైరస్ నిర్ధరణ అయింది. కళాశాల ప్రిన్సిపల్ సైతం కరోనా బారిన పడ్డారు. కళాశాలలో ఇప్పటివరకు మొత్తం 42 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరికొంతమంది ఫలితాలు రావాల్సి ఉంది. పాజిటివ్ కేసులు ఇంకా పెరిగే అవకాశం ఉంది. వైరస్ సోకిన కొందరు ఐసోలేషన్లో ఉండగా.. మరికొందరు ఇళ్లకు వెళ్లిపోయారని కళాశాల ఇంఛార్జి ప్రిన్సిపల్ తెలిపారు.
దేశంలో కరోనా కేసులు
India Corona cases: దేశంలో రోజువారీ కొవిడ్ కేసులు స్వల్పంగా తగ్గాయి. సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు 1,68,063 మంది వైరస్ బారిన పడ్డారు. కరోనా వల్ల మరో 277మంది మృతి చెందారు. 69,959 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. కొవిడ్ వ్యాప్తి నేపథ్యంలో దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 10.64 శాతానికి తగ్గినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.
- మొత్తం కేసులు:3,58,75,790
- మొత్తం మరణాలు:4,84,213
- యాక్టివ్ కేసులు:7,23,619
- మొత్తం కోలుకున్నవారు:3,45,70,131