ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా మద్యం దుకాణాలు తెరిచారు. మందుబాబులు వైన్ షాపుల ముందు ఉదయం నుంచి బారులు తీరారు. మద్యం దుకాణాల వద్ద భౌతిక దూరం పాటించే విధంగా యజమానులు చర్యలు తీసుకున్నారు. వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ సమీపంలోని మద్యం దుకాణం వద్ద హమాలీలు కార్మికులు పెద్ద సంఖ్యలో బారులు తీరారు. షాపుల వద్ద పరిస్థితిని ఎక్సైజ్, పోలీసు శాఖ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.
మద్యం కోసం క్యూ కట్టిన మందుబాబులు
రాష్ట్ర ప్రభుత్వం మద్యం దుకాణాలు తెరవడానికి అనుమతి ఇవ్వడం వల్ల ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా మందు విక్రయాలు మొదలయ్యాయి. మందుబాబులు మద్యం షాపుల ముందు ఉదయం నుంచి బారులు తీరారు.
హన్మకొండ కిషన్ పురా వద్ద మద్యం దుకాణాల ముందు రద్దీ ఎక్కువవడం వల్ల స్వల్ప లాఠీ ఛార్జీ చేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 255 దుకాణాలు తెరుచుకున్నాయని ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ సురేష్ రాఠోడ్ చెప్పారు. ములుగు జిల్లా కేంద్రంతో పాటు తొమ్మిది మండలాల్లో వైన్ షాపులు 10 గంటలకు తెరుచుకున్నాయి. మహబూబాబాద్ జిల్లా తొర్రూర్, పాలకుర్తిలో మద్యం దుకాణాల ముందు మందుబాబులు బారులు తీరారు. వరంగల్ రూరల్ జిల్లా పరకాల నియోజకవర్గంలో ఉదయం నుంచే మందుబాబుల కోలాహలం మొదలైంది.