ఓరుగల్లులో ఎండకాలంలో ఎన్నికల వేడి మొదలవనుంది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న గ్రేటర్ వరంగల్ ఎన్నికల నిర్వహణకు.. క్రమంగా ముహుర్తం దగ్గరకొస్తోంది. అన్నీ అనుకూలిస్తే... కొత్త సంవత్సరం ఉగాది తరువాత.. మూడు నాలుగు రోజుల్లో నోటిఫికేషన్ వెలువడే అవకాశాలున్నాయ్. గ్రేటర్ వరంగల్ పాలకమండలి పదవీ కాలం.. గత నెల 14కే పూర్తి కావడంతో... జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతును... ప్రత్యేకాధికారిగా నియమిస్తూ...ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇక వార్డుల పునర్విభజన కూడా ఎలాంటి అడ్డంకులు లేకుండా పూర్తైంది. మొత్తం 66 వార్డులతో రూపొందించిన ముసాయిదాకు పురపాలక శాఖ ఒకే చెప్పింది.
ప్రస్తుతం 66 వార్డులు
గతంలో 58 వార్డులుంటే... ఇప్పుడు నగరపాలక సంస్ధ పరిధిలో 66 వార్డులు అయ్యాయి. వార్డుల పునర్విభన తరువాత... ఓటర్ల గుర్తింపు ప్రక్రియ చేపట్టాల్సి ఉండగా... దాని కోసం... పురపాలక శాఖ 12 రోజుల షెడ్యూల్ ప్రకటించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్ల గుర్తింపు... శనివారం నుంచి ఈ నెల ఏడు వరకూ ఇంటింటి సర్వే చేసి 8న ముసాయిదా ప్రకటిస్తారు. 9వ తేదీ నుంచి 11 వరకు అభ్యంతరాలు, వినతులకు అవకాశం కల్పించారు. అభ్యంతరాలను పరిష్కరించి.. ఏప్రిల్ 14న.. ఎస్సీ, ఎస్టీ బీసీ, మహిళా ఓటర్ల వివరాలతో... వార్డుల వారీగా ఓటర్ల జాబితా వెలువడుతుంది.