వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో తెలంగాణ ఉద్యమకారుడు మధు... అతని కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న తనకు తెరాస పార్టీ, స్థానిక నాయకులు సరైన గుర్తింపు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ.... అమరవీరుల స్థూపం వద్ద భార్యా పిల్లలతో నిరసనకు దిగారు.
'ఉద్యమకారులను పట్టించుకోకపోతే పార్టీకి తీవ్ర నష్టం'
వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని అమరవీరుల స్థూపం వద్ద ఉద్యమకారుడు మధు ఆందోళనకు దిగారు. తనకు పార్టీలో తగిన గుర్తింపు ఇవ్వటం లేదని ఆరోపిస్తూ... కుటుంబసభ్యులతో సహా నిరసన చేశారు. ఉద్యమకారులను పట్టించుకోకపోతే రాబోయే రోజుల్లో తెరాస పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందని హెచ్చరించారు.
హసన్పర్తి మండలం వంగపహాడ్కు చెందిన సముద్రాల మధు... తెరాస పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేశారు. ఉద్యమంలో కూడా చురుకైన పాత్ర పోషించాడు. 2017లో మధుకు జిల్లా గ్రంథాలయ సంస్థ డైరెక్టర్గా పార్టీ అవకాశం కల్పించింది.
కొన్ని రోజుల నుంచి వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్, స్థానిక కార్పొరేటర్ బానోత్ కల్పన సింగిలాల్ పట్టించుకోవడం లేదని మధు ఆవేదన వ్యక్తం చేశారు. తీవ్ర మనస్తాపానికి గురైన మధు... పార్టీ క్రియాశీలక సభ్యత్వానికి రాజీనామా చేశారు. బడా కాంట్రాక్టర్లకు మద్దతు పలుకుతూ... వారికే పదవులు ఇస్తున్నారని ఆరోపించారు. ఉద్యమకారులను విస్మరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యమకారులను పట్టించుకోకపోతే రాబోయే రోజుల్లో తెరాస పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందని మండిపడ్డారు.