Sankranti Goats cart: సంక్రాంతి పండుగ రైతులకు ఎంతో ప్రత్యేకం. పండుగ రోజు నాడు పశువులను అందంగా అలంకరిస్తారు. రైతులకు జీవనాధారమైన ఎద్దులు, మేకలు, గొర్రెలకు పూజలు నిర్వహిస్తారు. అదేవిధంగా హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని శ్రీ కొత్తకొండ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలలో అందంగా అలంకరించిన మేకపోతుల బండి పలువురిని ఆకట్టుకుంది. ఉత్సవాలను వీక్షించేందుకు వచ్చిన యువకులు మేకపోతులతో సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు.
ప్రతి ఏటా సంప్రదాయం
veerabhadra Swamy temple: ప్రతి ఏడాది తమ పూర్వీకుల్లాగే వేలేరు మండలం ఉప్పరపల్లి గ్రామం నుంచి వీరభద్ర స్వామి ఆలయానికి మేకపోతు బండ్లను తీసుకొచ్చే సాంప్రదాయాన్ని తాము కొనసాగిస్తున్నామని రైతులు తెలిపారు. వీరభద్ర స్వామివారి దయవల్ల తమకు తమ కుటుంబాలకు మంచి జరుగుతుందని చెప్పారు. తమ మేకల మందలు కూడా సురక్షితంగా ఉంటాయని వెల్లడించారు.
ప్రత్యేక అలంకరణతో ఎడ్లబండ్లు
Bull carts in Sankranti: అదేవిధంగా భీమదేవరపల్లి మండలం కొత్తపల్లి గ్రామం నుంచి 58 ఎడ్లబండ్లను పువ్వులు, విద్యుద్దీపాలతో అలంకరించుకొని ఊరేగింపుగా వీరభద్ర స్వామి దేవాలయానికి తీసుకొచ్చారు. తమ పూర్వీకుల కాలం నుంచి ఎడ్లబండ్లను ఆలయానికి ప్రదర్శనగా తీసుకువస్తున్నట్లు గ్రామస్థులు తెలిపారు. అలాగే తమ పాడి పంటలు, కుటుంబాలను ఆదేవుడు చల్లగా చూడాలని కోరుతూ ఎడ్లబండ్లతో ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటామని వెల్లడించారు. అర్ధరాత్రి వేళ ఆలయానికి చేరుకున్న మేకపోతు, ఎడ్లబండ్లు భక్తుల సందడి మధ్య ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశాయి. ఎడ్లబండ్ల ప్రదక్షిణలు భక్తులను, చూపరులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
కొత్తకొండ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు