Mother Suffering Due to Son Illness: అనారోగ్యం కారణంగా మంచానికే పరిమితమైన కుమారుడిని చూసి ఆ తల్లి తల్లడిల్లిపోతుంది. ఉన్నదంతా పెట్టి అందినకాడికి అప్పులు చేసి చికిత్స చేయించింది. అయినా పరిస్థితిలో ఎలాంటి మార్పు కనిపించడం లేదు. వైద్య ఖర్చులు భరించే స్థోమత లేక.. కుమారుడి దీనస్థితిని చూడలేక ప్రస్తుతం ఆ తల్లి కుమిలిపోతుంది. కూలీనాలి చేస్తే వచ్చే డబ్బులతో పూట గడవడమే కష్టంగా మారిన కష్ట సమయంలోనూ ఎలాగోలా పిల్లల కడుపు నింపుకుంటూ వచ్చింది. ఇప్పుడు ఆ తల్లి కాలు పట్టు తప్పడంతో పనికి వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది.
నవ మాసాలు మోసి కన్న కుమారుడికి పాతికేళ్లు వచ్చినా.. అతడిని ఇంకా ఆ తల్లి మోయాల్సి వస్తోంది. అతడికి అనారోగ్యం కారణంతో అన్ని పనులూ ఆమే చేయాల్సి వస్తోంది. చదువుకుంటున్న ఇద్దరు కుమార్తెల పోషణ భారమూ ఆమెదే. ఆ తల్లికి వయసు పైబడుతుండటంతో పిల్లల భవిష్యత్తుపై బెంగతో నలిగిపోతుంది. వివరాల్లోకి వెళితే.. వరంగల్‌కు చెందిన మహ్మద్ సాదిక్షాషా, తస్లీమాలు దంపతులు. వారికి 26 ఏళ్ల కిందట వివాహమైంది. ఈ దంపతులకు ముగ్గురు సంతానం. అయితే కుమారుడు యాకూబ్షాషా (25) పెద్దవాడు. కుమార్తెలు సనా (16), ఖాజాబీ (15). వరంగల్‌లో నివాసముండే ఈ కుటుంబం బతుకుదెరువు కోసం తొర్రూరుకు వచ్చింది. అక్కడే పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.